సహజంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలని పెద్దగా చెప్పరు. ఆయన ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా దానిలో సబ్జెక్టు ఉంటుంది. తాజాగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మంగళగిరి నియోజకవర్గం గురించి వివరించారు. ఈ నియోజకవర్గం ఆదర్శంగా మారిందని.. ఒక్కసారి అందరూ కుదిరినప్పుడు నియోజకవర్గంలో పర్యటించాలని కూడా సూచించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్న తీరును కూడా పరిశీలించాలన్నారు.
గత 2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఇక్కడ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ.. పట్టుదలతో ముందుకు సాగారు. నియోజవకర్గంలోని ప్రతిఇంటికీ ఆయన పరిచయమయ్యారు. యువగళం పాదయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా చేయగా.. మంగళగిరి నియోజకవర్గంలో యువగళానికి ముందే పాదయాత్ర చేశారు. ప్రతి ఇంటినీ టచ్ చేశారు. తద్వారా.. పార్టీపరంగానే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా ఆయన పరిచయం అయ్యారు. ఇది 2024 ఎన్నికల నాటికి కలిసివచ్చింది.
లోకేష్ అంటే.. మన నాయకుడు అనే మాట వినిపించేలా చేశారు. 2024లో కేవలం గెలుపు గుర్రం ఎక్కడమే కాకుండా.. భారీమెజారిటీని కూడా లోకేష్ దక్కించుకున్నారు. అందుకే సీఎం చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా పేర్కొన్నారు. దీనిలో చేపడుతున్న అభివృద్ధి పనులను కూడా వీక్షించాలని చెప్పారు. ప్రజలతో మమేకం అవుతున్న తీరును కూడా ఆయన నాయకులకు వివరిం చారు.
ఎందుకిలా.. ?
ప్రస్తుతం సోషల్ మీడియా దూకుడు పెరిగిన తర్వాత.. నాయకులకు-ప్రజలకు మధ్య సంబంధం కూడా పెరిగింది. మంచిని మంచిగానే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో లోకేష్ గెలుపు ఖాయమని అంటున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా.. నేనున్నానంటూ లోకేష్ వస్తున్నారు. తరచుగా నియోజకవర్గంలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇలానే ఇతర నియోజకవర్గాల్లో కూడా నాయకులు వ్యవహరించాలన్నది చంద్రబాబు ఆలోచన. మరి ఆదిశగా అడుగులు వేస్తారా? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates