బాలయ్య డైలాగ్‌తో హైదరాబాద్ పోలీసుల పంచ్

నీట్‌గా నీతులు చెబితే ఈ తరం యువతకు ఎక్కదు. వాళ్లు పట్టించుకోరు. కొంచెం ఎంటర్టైన్మెంట్ జోడించి, ట్రెండీగా చెబితేనే విషయం వాళ్ల బుర్రల్లోకి వెళ్తుంది. ఈ విషయాన్ని బాగానే అర్థం చేసుకున్న హైదరాబాద్ పోలీస్ వర్గాలు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను నడిపే తీరు నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. సినిమాలు, క్రికెట్ లాంటి యువతకు నచ్చే అంశాలతో ముడిపెట్టి తాము చెప్పాలనుకున్న విషయాల్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తుంటారు.

ముఖ్యంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ట్విట్టర్ హ్యాండిల్‌కు ఆన్ లైన్లో మంచి ఫాలోయింగే ఉంది. మన టాలీవుడ్ స్టార్ల సినిమాల్లో డైలాగుల్ని తీసుకుని ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించేవారికి హెచ్చరికలు, పంచ్‌లు వేస్తుంటారు ఈ హ్యాండిల్‌లో. తాజాగా నందమూరి బాలకృష్ణ డైలాగ్ ఒకదాన్ని తీసుకుని వేసిన పంచ్ నెటిజన్లను అలరిస్తోంది.

బాలయ్య ఇంతకుముందు తన ‘లయన్’ సినిమా ఆడియో వేడుకలో మాట్లాడుతూ.. ఆ సినిమాలోని కొన్ని డైలాగులు పేల్చారు. అవయ్యాక ‘‘అప్పుడే అయిపోయింది అనుకోకండి. లోపల ఇంకా చాలా దాచిపెట్టాం’’ అన్నాడు. ఈ డైలాగ్ మీద సోషల్ మీడియాలో బోలెడన్ని మీమ్స్ వచ్చాయి. ఆ డైలాగ్‌ను ఇప్పుడు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాడుకున్నారు. నాటి బాలయ్య స్పీచ్ తాలూకు ఫొటో పెట్టి.. ‘‘అప్పుడే అయిపోయింది అనుకోకండి. ఇంకా చాలా ఉంది. వీకెండ్ గురించి దాచి ఉంచాం’’ అని క్యాప్షన్ జోడించారు. బ్యాగ్రౌండ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ దృశ్యం పెట్టారు.

కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో రాత్రి పూట హైదరాబాద్ సిటీలో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు పెద్ద ఎత్తున చేశారు. ఐతే కొత్త సంవత్సర వేడుకలు అయిపోయాయి కాబట్టి పోలీసులు సైలెంట్ అయిపోతారని అనుకోవద్దని.. వీకెండ్ సందర్భంగా శని, ఆదివారాల్లోనూ పరీక్షలు కొనసాగుతాయని.. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ బాలయ్య డైలాగ్‌ను వాడటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.