జగన్, కేటీఆర్… బోత్ ఆర్ సేమ్!

వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు… ఇద్దరూ రెండు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారే అయినా… వ్యవహారంలో మాత్రం అచ్చు గుద్దినట్లు ఇద్దరూ ఒకేలా సాగిపోతారు. ఈ ఇద్దరూ ఒకేసారి అధికారంలో ఉంటే… 6 నెలల వ్యవదిలో ఇద్దరూ అధికారం కోల్పోయారు. తాజాగా విపక్షాలుగా ఉన్న తమ పార్టీలకు చెందిన నేతల అరెస్టుల విషయంలోనూ ఇద్దరూ ఒకే రీతిన వ్యవహరిస్తున్నారు. వెరసి ఇటీవల బాగా వినిపిస్తున్న బాలయ్య డైలాగ్ బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న డైలాగ్… వీరి విషయంలో మాత్రం బోత్ ఆర్ సేమ్ అంటూ తిరగబడిపోయింది.

ఇక అసలు విషయానికి వస్తే… తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇటీవలే అరెస్టు అయ్యారు కదా. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైలులో విచారణ ఖైదీగా కొనసాగుతున్నారు. సుమన్ ను పరామర్శించే నిమిత్తం గురువారం కేటీఆర్ చంచల్ గూడకు వెళ్లారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఇతర స్థానిక నేతలు తోడు రాగా… కేటీఆర్ చంచల్ గూడ జైలుకు చేరుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలతో కలిసి ఆయన సుమన్ ను పరామర్శించారు.

ఇదేమీ అంత పెద్ద విషయం కాకున్నా… జగన్ తో పోల్చి చూస్తే… కేటీఆర్ కూడా జగన్ స్ట్రాటజీలోనే సాగుతున్నారని చెప్పాలి. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్టు అయినప్పుడు ఆయనను పరామర్శించే నిమిత్తం జగన్ ఏకంగా గుంటూరులోని జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంచల్ గూడ జైలుకు కేటీఆర్ వెళ్లిన వైనం చూస్తుంటే… నాటి జగన్ గుంటూరు జైలు పరామర్శే గుర్తుకు వస్తోందని చెప్పక తప్పదు.

ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా పరిశీలించాలి. నాడు వైసీపీలో అరెస్టు అయిన నేత దళిత సామాజిక వర్గానికి చెందిన నేత అయితే… నేడు తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వారే. రాజకీయ పార్టీల్లో దళిత నేతలు బయట ఉన్నప్పుడు వారికి అంతగా ప్రాధాన్యం ఇవ్వని ఆయా పార్టీల అధినేతలు వారు అరెస్టు కాగానే.. వారి మీద తమకు ఎంతగానో ప్రేమ ఉన్నట్లుగా నేరుగా జైళ్లకు వెళ్లి మరీ పరామర్శిస్తారు. జగన్, కేటీఆర్ లలోనూ ఇదే తరహా వైఖరి కనిపిస్తోందన్న చర్చ అయితే జరుగుతోంది.

నందిగం ఒక్కసారే ఎంపీగా గెలిచినా… సుమన్ తనకు కేబినెట్ లో చోటు దక్కుతుందేమోనన్న భావనతో ఎంపీ సీటును వదిలేసి మరీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దళిత సామాజిక వర్గానికి సంబంధించి బీఆర్ఎస్ లో సుమన్ ఓ కీలకమైన నేత కిందే లెక్క. అయితే అదికారంలో ఉన్నంత కాలం సుమన్ ను పట్టించుకోని కేటీఆర్.. ఆయన అరెస్టు కాగానే… ఆయనను పరామర్శించేందుకు ఏకంగా జైలుకు వెళ్లడం గమనార్హం.