తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించదలిచిన సభకు పోలీసులు, కోర్టు అనుమతినివ్వకపోవడం రాజకీయ దుమారానికి తెర లేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదని, తనను తెలంగాణలో అడుగుపెట్టనివ్వబోమని చెబితే భయపడే ప్రసక్తే లేదని పవన్ అన్నారు. ఆ తర్వాత పవన్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రతి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి స్పందించారు.
పవన్ సభకు అనుమతినివ్వకపోవడం సరికాదని చంద్రబాబు అన్నారు. తాను తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేశానని, అక్కడకు కర్ణాటక నుంచి అప్పటి డిప్యూటీ సీఎం శివ కుమార్ కూడా వచ్చారని గుర్తు చేశారు. అమెరికాలో తెలుగు వారు సెనేటర్లు అవుతున్నారని, యూరప్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా మనోళ్లు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఎవరు బెటర్ సర్వీస్ అందిస్తే వారిని ప్రజలు ఎన్నుకుంటున్నారని అన్నారు.
కొందరు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలు సరికాదని, ఆంధ్రాలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. జనసేన గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, అది సరికాదని అన్నారు.
రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు అయ్యిందని, ఎవరెవరు ఏం చేశారు అన్నది ప్రజలకు తెలుసని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంలో పోటీ పడాలని, లేనిపోనివి మాట్లాడి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడం సరికాదని హితవు పలికారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates