తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవడం వంటి పరిణామాలు విమర్శకులకు అస్త్రాలుగా మారాయి.
కొద్ది నెలల క్రితం జరిగిన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. ఆ ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ అధినేత పవన్ వస్తారని ప్రచారం చేసినా..చివరకు అనివార్య కారణాల వల్ల ఆయన రాలేదు. దీంతో, తెలంగాణలో జనసేన యాక్టివ్ గా లేదు అన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు.
తెలంగాణపై తనకున్న ప్రేమను శంకిస్తున్నారని, అందుకే ఇప్పుడు తానొక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తాను ఇప్పటి దాకా నిర్ణయించుకోలేదని, మీరంటున్నారు కాబట్టి చెబుతున్నా అని, తెలంగాణలో జనసేన ఉంటుందని, తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ సంచలన ప్రకటన చేశారు.
అవసరమైతే తెలంగాణలో తిరుగుతామని, తాను తిరుగుతానని, తామంతా తిరుగుతామని చెప్పారు. అంతేకాదు, తెలంగాణలోని ప్రతి సమస్య మీద మాట్లాడతానని, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కుంటామని అన్నారు.
తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అన్న విషయం మరచిపోవద్దని, తనను తెలంగాణలోకి రాకూడదని, సభ పెట్టుకోకూడదని బెదిరిస్తే భయపడబోమని అన్నారు. తెలంగాణను వ్యతిరేకించినవారంతా పదవుల్లో కూర్చున్నారని, వారంతా ఎమ్మెల్యేలయ్యారని చెప్పారు.
తెలంగాణలో ఆంధ్రా కాంట్రాక్టర్లు ఓకే అని, కానీ, ఆంధ్రా నేతలు వద్దా అని ప్రశ్నించారు. ఎవర్ని బేవకూఫ్ లు చేస్తారు అని పవన్ ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టి తనలాంటివారిని భయపెడుతున్నారని అన్నారు. పవన్ కు అనుమతి లేదని తెలంగాణలో అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని పవన్ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates