కార్యకర్తలే ఏ రాజకీయ పార్టీకి అయినా ఆధారం. కార్యకర్తల బేస్ పై నిర్మితమయ్యే పార్టీలు సుదీర్ఘ కాలం మనగలుగుతాయి. విజయాలూ సాధిస్తాయి. మహానాడు పేరిట వార్షిక వేడుకలు జరుపుకుంటున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ) విషయానికి వస్తే ఈ మాట ముమ్మాటికీ నిజమని చెప్పక తప్పదు. అందుకే కాబోలు… పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి పేరిట ఓ ప్రత్యేక నిధిని కొనసాగిస్తున్న పార్టీగా టీడీపీకి ఓ మంచి గుర్తింపు ఉంది. అంతేనా.. ఈ నిధి కింద పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్న టీడీపీ… కార్యకర్తలందరికీ బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది.
టీడీపీకి ఉన్నది ఏ వెయ్యో, రెండు వేల మందో కార్యకర్తలు కాదు కదా. టీడీపీ కార్యకర్తల సభ్యత్వాల సంఖ్య ఇప్పటికే కోటి మార్కును దాటిపోయింది. ఈ కోటి మందికి పైగా నమోదు అయిన కార్యకర్తలకు ఏటా టీడీపీ బీమా కల్పిస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ అన్ని విషయాల కంటే కూడా అధిక మొత్తంలో నిధులను వెచ్చిస్తోంది. టీడీపీ వ్యయ పట్టికలో అత్యధిక శాతం నిధులు ఖర్చు అవుతున్నది ఒక్క కార్యకర్తల బీమా కోసం వినియోగిస్తున్న నిధులే ఉంటున్నాయి.
తాజాగా బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన వార్షిక వేడుక సందర్భంగా పార్టీ కోశాధికారి హోదాలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పార్టీ పద్దుల చిట్టాను విప్పారు. కొనకళ్ల చెప్పిన దాని ప్రకారం కార్యకర్ల సంక్షేమం కోసం గడచిన ఏడాది (ఈ ఏడాది మార్చితో ముగిసిన ఏడాదికి)లో రూ.46.26 కోట్లను వెచ్చించారు. ఈ ఏడాదిలో పలు పద్దుల కింద పార్టీకి రూ.90 కోట్ల మేర ఆదాయం రాగా… ఖర్చుల కింద రూ.74.25 కోట్లుగా ఉంది. ఈ రూ.74 కోట్ల ఖర్చులో కేవలం ఒక్క కార్యకర్తల సంక్షేమం కోసమే టీడీపీ ఏకంగా రూ.46 కోట్లను వెచ్చించడం గమనార్హం.
ఇక పార్టీ మొత్తం ఆదాయ వ్యయాలు, నికర నిధుల విషయానికి వస్తే… గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని ఆదాయ మార్గాల ద్వారా రూ.90 కోట్ల ఆదాయం రాగా… ఖర్చుల కింద రూ.64.25 కోట్లు ఖర్చు అయ్యాయి. ఇక గతేడాదితో పాటుగా అప్పటికే పోగుబడిన నిధులతో కలిపి టీడీపీ నిధిలో మొత్తంగా 485.81 కోట్టు ఉన్నట్లు కొనకళ్ల ప్రకటించారు. పార్టీ సభ్యత్వాలతో ఓ మోస్తరు ఆదాయం వస్తుండగా.. పార్టీ నేతల నుంచి విరాళాల రూపంలో పార్టీ నిధికి పెద్ద ఎత్తున నిధులు జమ అవుతున్నాయి. ఈ జమ అయిన నిధుల్లో పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం టీడీపీ అత్యధిక మొత్తంలో ఖర్చు చేస్తుండటం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates