సీఎం పోస్ట్ వదిలినా గేమ్ ఆగలేదు..

దక్షిణాది రాష్ట్ర కర్ణాటకలో గడచిన మూడు రోజులుగా ముఖ్యమంత్రి పదవి మార్పు దిశగా పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలు చివరాఖరుకు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసే దాకా దారి తీశాయి. సీఎం సీటును వదిలేసిన సిద్ధరామయ్య… రాజ్యసభ సభ్యత్వాన్ని మాత్రం తీసుకోనని తేల్చి చెప్పేశారు. సీఎం పదవిని వదిలేశాక తాను ఓ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని ఆయన గురువారం సంచలన ప్రకటన చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆయన తన రాజీనామాకు దారి తీసిన కారణాలను వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానమే తనను సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేసిందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అదిష్ఠానం ఆదేశాల మేరకే తాను సీఎం పదవికి రాజీనామా చేశానని చెప్పారు. అదిష్ఠానం నిర్ణయమే తనకు శిరోధార్యమని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని తీసుకోవాలని అధిష్ఠానం తనను ఆదేశించిందని ఆయన చెప్పారు. సీఎం పదవికి రాజీనామా వరకు అధిష్ఠానం మాట మేరకే నడుచుకున్నానని చెప్పిన సిద్ధరామయ్య… రాజ్యసభ సభ్యత్వాన్ని మాత్రం తిరస్క్రరించానని పేర్కొన్నారు.

సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత మరేం చేస్తారన్న మీడియా ప్రశ్నలకు సూటిగానే స్పందించిన సిద్ధరామయ్య.. తాను ఇకపై ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాలను తాను వదిలేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. సీఎ: పదవి లేకపోతేనేం… ఎమ్మెల్యేగా కొనసాగుతాను అని ఆయన చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలన్న తన భావన కారణంగానే రాజ్యసభ సీటును వద్దని చెప్పానని తెలిపారు. సీఎం సీటును వదిలేస్తే ఎమ్మెల్యేగా కొనసాగకూడదా? అని కూడా ఆయన ఎదురు ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే… గురువారం ఉదయం పార్టీ ముఖ్యులతో సమావేశమైన సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అంతేకాకుండా కొత్త సీఎంగా దాదాపుగా ఖరారైన ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను వెంటేసుకుని మరీ లోక్ భవన్ కు వెళ్లిన సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తన కేబినెట్ సహచరులతో భేటీ అయిన సిద్ధరామయ్య… ఈ మూడేళ్లలో ప్రజలకు మంచి చేయాలన్న దిశగానే పనిచేశానన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలును పూర్తి చేసే దిశగా పనిచేసినట్లు ఆయన తెలిపారు.