ఇలాగైతే ఏ ఒక్క వైసీపీ ఇంచార్జీ పాస్ కాలేడు!

ఏపీలో విపక్ష వైసీపీ తన ప్రస్థానంలో ఎన్నడూ లేనంత దీన స్థితిలో కొనసాగుతోందని చెప్పాలి. 151 సీట్లతో అత్యంత బలంగా కనిపించిన వైసీపీ… 2024 ఎన్నికల్లో ఒకే దెబ్బకు 11 సీట్లకు పడిపోయిన వైనమే ఆ పార్టీ దీన స్థితిని కళ్లకు కట్టినట్టు చెబుతోంది. ఈ షాక్ నుంచి ఇంకా వైసీపీ ఇంచార్జీలెవరూ తేరుకోలేదనే చెప్పాలి.

అలాంటి వారిపై ఇప్పుడు పార్టీ అదినేత హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో మోయలేని బరువును మోపారు. జగన్ పెట్టిన బరువును మోసే స్థాయి కలిగిన నేత వైసీపీలో ఏ ఒక్కరూ లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జగన్ పెట్టిన పరీక్షలో పాస్ అయ్యే నేత ఒక్కరంటే ఒక్కరూ లేరన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అయినా వైసీపీ ఇంచార్జీలపై జగన్ మోపిన భారం ఏమిటన్న విషయానికి వస్తే…ఏపీలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు అధికార కూటమి పార్టీలు ఉత్సాహంతో ముందుకు సాగుతుండగా… విపక్ష వైసీపీలో మాత్రం ఆ ఎన్నికల మాట వింటేనే భయం కనబడుతోంది.

ఇలాంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ నేతలంతా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించాలని జగన్ చెప్పారు. ఏ స్థానిక సంస్థ అయినా ఏకగ్రీవంగా ముగిస్తే…అది ఆ నియోజకవర్గ ఇంచార్జీ ఫెయిల్యూర్ గా పరిగణిస్తానని, ఈ విషయాన్ని తాను చాలా సీరియస్ గా పరిగణిస్తానని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు.

అసలే సార్వత్రిక ఎన్నికల్లో తగిలిన దెబ్బలే ఇంకా మానలేదు… ఇప్పుడు కొత్తగా ఈ మోయలేని భారాన్ని ఎలా మోసేది అంటూ జగన్ వ్యాఖ్యలసై వైసీపీ ఇంచార్జీలు సణుక్కుంటున్నారు. అయినా స్థానిక సంస్థల ఎన్నికలంటేనే అధికార పార్టీకి అత్యంత అనుకూలంగా ఉంటాయన్న విషయం జగన్ కు తెలియనిది కాదు కదా అంటూ వారు వాదిస్తున్నారు.

అన్నీ తెలిసి ఏకగ్రీవాలను అడ్డుకోవాలని జగన్ ఎలా పిలుపునిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు జగన్ నోట ఫెయిల్యూర్ అన్న మాట వినిపించినంతనే వైసీపీ ఇంచార్జీలంతా షాక్ కు గురయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ ఇదే మాటను పట్టుకుని సాగితే… జగన్ టెస్ట్ లో పాస్ అయ్యే నేత ఒక్కరు కూడా ఉండరని వారిలో వారే చర్చించుకుంటున్నారు. మరి నేతల్లోని ఈ భయాందోళనలు జగన్ కు తెలుస్తాయో, లేదో చూడాలి.