మీడియా ముందు వీహెచ్ పప్పులుడకలేదా ?

నోటికొచ్చినట్లు మాట్లాడేయటం తర్వాత సీన్ రివర్సవ్వగానే మీడియా తన మాటలను వక్రీకరించిందని గోల చేయటం నేతలకు బాగా అలవాటైపోయింది. ఒకపుడు ప్రింట్ మీడియా మాత్రమే ఉన్న కాలంలో అయితే తాము ఏమి చెప్పినా తర్వాత ఎంత అడ్డం తిరిగినా నేతలకు చెల్లుబాటయ్యేది. కానీ ఇపుడు టీవీ ఛానళ్ళు వచ్చేసిన తర్వాత నేతలు మాట్లాడే ప్రతి మాట ఆడియో, వీడియోతో సహా రికార్డయిపోతోంది. కాబట్టి నోటికొచ్చింది మాట్లాడేసి తర్వాత అడ్డం తిరిగి తప్పించుకుందామనుకుంటే సాధ్యంకాదు. తాజాగా సీనియర్ నేత వీహెచ్ అలాగే వివాదాల్లో తగులుకున్నారు.

తెలంగాణా పీసీసీ అధ్యక్షుని నియామకం ఎంత వివాదాస్పదమవుతోందో అందరు చూస్తున్నదే. అధ్యక్షస్ధానానికి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, వీహెచ్, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది పోటిపడుతున్నారు. అధ్యక్షునిగా ఎవరైతే బాగుంటుందనే విషయంలో పెద్ద ఎత్తున అభిప్రాయసేకరణ కూడా జరిగింది. అధిష్టానం దూతగా మాణిక్కం ఠాకూర్ నాలుగు రోజులు హైదరాబాద్ లో క్యాంపు వేసి 170 మంది నేతలతో మాట్లాడి ఢిల్లీ వెళ్ళిపోయారు.

రేవంత్ పదవి దక్కుతుందేమో అని కోపం…

ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి రేవంత్ నే అధ్యక్షునిగా నియమించే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. దాంతో వీహెచ్ లో కోపం కట్టలు తెంచుకుంది. మొదటినుండి రేవంత్ అంటే వీహెచ్ కు ఎక్కడో కాలుతోంది. ఎప్పుడు అవకాశం దొరికినా లేకపోతే అవకాశాన్ని దొరికించుకుని మరీ రేవంత్ పై హన్మంతు విరుచుకుపడిపోతుంటారు. అలాంటిది ఇపుడు వదిలిపెడతారా ? అందుకనే రేవంత్ ను ఎటాక్ చేస్తునే పనిలో పనిగా మాణిక్కం కూడా ప్యాకేజీకి అమ్ముడుపోయారంటూ నోటికొచ్చింది మాట్లాడేశారు.

వీహెచ్ స్టైలే ఇంత… ప్లేటు మార్చేశాడు

వీహెచ్ తో సమస్యేమిటంటే నోటికొచ్చింది అనేసి తాను చెప్పిందంతా పార్టీ మంచికోసమే అని దబాయించేస్తుంటారు. పార్టీ మంచికోసమే అనే ముసుగులో ప్రత్యర్ధులపై ఏదేదో ఆరోపణలు చేసేయటం వీహెచ్ కు అలవాటే. అందుకనే ఈ సీనియర్ నేతను ఇపుడు ఎవరు పట్టించుకోవటం లేదు. కానీ ఎప్పుడైతే మాణిక్కం ప్యాకేజీకి అమ్ముడుపోయారని ఆరోపణలు చేశారో వెంటనే అదిష్టానం సీరియస్ అయిపోయింది. వీహెచ్ ఆరోపణలను సీరియస్ గా తీసుకుని వివరణ ఇవ్వాలంటు నోటీసులు పంపింది. దాంతో వీహెచ్ ప్లేటు మార్చేశారు. మీడియానే తన మాటలను వక్రీకరించిందంటు గోల మొదలుపెట్టేశారు.

వీహెచ్ అన్న ప్రతిమాట వీడియోరూపంలో సాక్ష్యంగా నిలుస్తున్నా కూడా అంతా మీడియా సృష్టే అని ఎలా చెబుతున్నారో అర్ధం కావటంలేదు. తన ఆరోపణల్లో ఎక్కడా దురుద్దేశ్యం లేదట. తన మాటలను మీడియానే వక్రీకరించిందట. వీహెచ్ వివరణ ఎలాగున్నా ఆయన మాటలు యధాతధంగా ఢిల్లీకి చేరిపోయాయట. నోటిని అదుపులో ఉంచుకోకపోతే ఎంతటి వాళ్ళకైనా ఇబ్బుందులు తప్పవని వీహెచ్ లాంటి వాళ్ళు తెలుసుకుంటే మంచిది.