ఏపీ రాజధాని అమరావతిని వ్యతిరేకిస్తున్న వైసీపీ అధినేత జగన్.. మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. అది విఫలమైంది. ఇక, ఇటీవల రాజధానికి చట్ట బద్ధత కల్పించే బిల్లును పాస్ చేసినప్పుడు.. మావిగన్ పేరుతో చేసిన ప్రతిపాదన కూడా బెడిసి కొట్టి నవ్వుల పాలైంది. మొత్తంగా.. జగన్ ఏమనుకున్నా.. ప్రజలు మాత్రం అమరావతిని కోరుకుంటున్నారు. కానీ, ఈ విషయాన్ని జగన్ గ్రహించలేక పోతున్నారో.. లేక ,ఆయన ఎవరో చెప్పిన మాటలనే ఇంకా వంటబట్టించుకుంటున్నారో తెలియడం లేదు. కానీ.. అమరావతిపై ఇంకా యాగీనే చేస్తున్నారు.
నిజానికి తాను కావాలని అనుకున్న చట్టాలను.. రైతులు వ్యతిరేకించినప్పుడు.. ప్రధాని నరేంద్ర మోడీనే వెనక్కి తగ్గారు. వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చినప్పుడు.. దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకించారు. దీంతో కొన్నాళ్లు వేచి చూసి.. ఆతర్వాత ఆయనే వాటిని హుందాగా వెనక్కి తీసుకున్నారు. కానీ, తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లేనని వాదించే జగన్.. మాత్రం ఇప్పటికీ.. అనేక దెబ్బలు తిన్నాక కూడా.. అమరావతిపై ఇంకా తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా అమరావతికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ.. తన మీడియాలో కథనాలు రాయించారు.
వాస్తవానికి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే అయినా.. కొంత మేరకు పెట్టుబడులు పెట్టాలికదా..? అనే చిన్న లాజిక్‌ను జగన్ మరిచిపోతున్నట్టు స్పష్టమవుతోంది. దీంతో ప్రభుత్వం దుబారా చేస్తోందని.. అమరావతికి ప్రజల ధనాన్ని ధార పోస్తోందని పేర్కొంటూ.. తన ఆవేదనను రాష్ట్ర ఆవేదనగా మార్చే ప్రయత్నం చేశారు. నిజానికి అమరావతికి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లేమీ ధార పోయడం లేదు. కేంద్ర సహకారంతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి నిధులు తీసుకుని.. డెవలప్ చేస్తోంది. అదేసమయంలో చిన్న చితకా పనులకు మాత్రమే రాష్ట్ర బడ్జెట్‌నుంచి కొంత మేరకు నిధులు ఇస్తోంది.
ఇలా.. తాజాగా 2000 కోట్లను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. ఇవి కూడా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయాధికారుల భవనాలకు ఫినిషింగ్ పనులకు ఇచ్చినట్టు సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. దీనిలో తప్పేముంది.
పైగా.. ఇచ్చిన సొమ్మును కూడా దొడ్డిదారిలో ఏమీ ఇవ్వలేదు. నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించారు. రాజధానిలో ఈ నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. వచ్చే శ్రావణ మాసం నుంచి న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అక్కడే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫినిషింగ్ పనులకు కేటాయించిన సొమ్ముపైనా జగన్ రాద్ధాంతం చేస్తున్నారని.. టీడీపీ నాయకులు దుయ్యబడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates