ఎవరిది ఏ కులమో తెలియక్కర్లేదా? అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా కుల గణనను చేపట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానులే అయినా.. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సక్రమంగా అందించేందుకు, అర్హులకు అవి చేరేందుకు కులాల ప్రాతిపదికన జాబితా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ ప్రక్రియలో తప్పులు వెతకాల్సిన అవసరం లేదని పేర్కొంది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం.. గృహ గణన జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇది అయిన తర్వాత.. కుల గణనను, అదేవిధంగా జనాభా గణనను చేపట్టనున్నారు. అయితే.. కుల గణను వ్యతిరేకిస్తూ.. వందలాది పిటిషన్లు.. సుప్రీంకోర్టుకు చేరాయి. కులం అనేది గోప్యతా హక్కు కిందకు వస్తుందని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 దేశంలో అందరూ సమానులే అయినప్పుడు.. కులాలను లెక్కించడం ద్వారా కొందరు ఎక్కువ.. మరికొందరు తక్కువ అనే భావం ప్రభుత్వాలే కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.
ఆయా పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కులాల లెక్కింపును సమర్థించింది. కులగణనను ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయంగా పేర్కొంది. దీనిలో కోర్టుల జోక్యం ఉండదని స్పష్టం చేసింది. దేశంలో ఎంతో మంది ప్రజలు వెనుకబాటుకు గురవుతున్నారని.. వారికి ప్రభుత్వాలు మేలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో కులాల ప్రాతిపదికన జాబితాలు ఉంటే తప్పులేదని వ్యాఖ్యానించింది.
ముఖ్యంగా వెనుకబడిన కులాల వారి వివరాలు తెలుసుకుంటే.. తద్వారా ప్రభుత్వాలు మరింత మంచి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని స్పష్టం చేసింది. అర్హులైన వారికి అన్యాయం జరగకుండా ఉండేందుకు కూడా ఈ ప్రక్రియను స్వాగతించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానులేనని.. కానీ, కుల ప్రాతిపదిక లెక్కలు తీస్తే.. ఆర్టికల్కు వచ్చిన నష్టం ఏమీ లేదని తద్వారా.. సమానులు కాకుండా పోరని వ్యాఖ్యానించింది. సదరు పిటిషన్లను కొట్టివేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates