తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో టీడీపీ వార్షికోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది విపక్షం వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో మహానాడును నిర్వహించిన టీడీపీ… ఈ ఏడాది ఈ వేడుకలకు నెల్లూరును ఎంచుకుంది. అయితే పొదుపు చర్యల్లో భాగంగా నెల్లూరు వేదికను రద్దు చేసిన పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ దఫా మహానాడును ఆన్ లైన్ రూపంలో జరపాలని ఆయన తీర్మానించారు.
ఈ మేరకు పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పలు విపరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను ఎదుర్కొని నిలిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు చర్యలను ప్రకటించారు. ఈ చర్యల్లో భాగంగా ప్రధానంగా ఇంధనం ఆదా చేసే చర్యలను దేశవ్యాప్తంగా చేపడుతున్నారు.
ఈ క్రమంలోనే భారీ ఎత్తున జరిగే మహానాడును యధావిదిగా నిర్వహిస్తే… భారీ స్థాయిలో ఇంధనం ఖర్చు అవుతుందని గ్రహించిన చంద్రబాబు… ఆ ఇంధన వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకే ఆన్ లైన్ మహానాడును ఎంచుకున్నారు. పార్టీ శ్రేణులకు ఈ మేరకు ఆన్ లైన్ మహానాడు మార్గదర్శకాలు చేరిపోయాయి.
ఆన్ లైన్ మహానాడులో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాత్రమే పాలుపంచుకుంటారు. ఇక జిల్లాలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఎక్కడికక్కడ కార్యక్రమాలను పార్టీ శ్రేణులు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 1,845 క్లస్టర్లలో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి కేంద్ర కార్యాలయంలో జరిగే వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వెరసి ఈ దఫా టీడీపీ వార్షిక వేడుకలైన మహానాడు ఆన్ లైన్ లో అత్యాధునిక విధానంలో జరగనుంది.
ఇదిలా ఉంటే… ఈ దఫా మహానాడు వేడుకలను నెల్లూరులో నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది తెలుగు తమ్ముళ్లు పాలుపంచుకునే ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే నెల్లూరులో ఎంపిక చేసిన స్థలంలో కార్యక్రమ ఏర్పాట్లు మొదలైపోయాయి.
అయితే పొదుపు చర్యల్లో భాగంగా ఆన్ లైన్ మహానాడు అంటూ అదిష్ఠానం కీలక నిర్ణయం తీసుకోవడంతో నెల్లూరులో జరుగుతున్న ఏర్పాట్లన్నీ శుక్రవారం సాయంత్రానికే నిలిచిపోయాయి. ఇక ఆయా క్లస్టర్లలో స్క్రీన్ల ఏర్పాటుకు సంబందించిన చర్యలను పార్టీ శ్రేణులు మొదలుపెట్టనున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
