జనసేన పార్టీకి సంబంధించి రాయల సీమ జిల్లాల వ్యవహారాలు సమీక్షించడంతోపాటు.. క్షేత్రస్థాయిలో ఇంచార్జ్‌లను నియమిం చేందుకు ఉద్దేశించిన సమావేశం రచ్చకు దారితీసింది. పార్టీలో కీలక నాయకులుగా ఉన్నవారిని వ్యతిరేకిస్తూ.. కొందరు నాయకులు బహిరంగ విమర్శలు చేశారు. సమావేశం నిర్వహణను కూడా బహిష్కరించారు. దీంతో జనసేనలో అంతర్గతంగా ముసురుకున్న వివాదాలు రోడ్డున పడినట్టు అయింది. ముఖ్యంగా పార్టీలో వ్యవస్థాపక సమయం నుంచి ఉన్న నాయకులకుఎలాంటి గుర్తింపు లేకుండా పోయందని పలువురు వ్యాఖ్యానించారు.
అయితే.. ఇదంతా కూడా వైసీపీ నుంచి వచ్చి.. జనసేనలో చేరిన వారు చేస్తున్న కుట్రలని.. మాజీ మంత్రి, రాయలసీమ జిల్లాల జనసేన పార్టీ ఇంచార్జ్ బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. అయితే.. వాస్తవానికి ఆయనకు వ్యతిరేకంగానే నాయకులు గళం వినిపించడం గమనార్హం. జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు.
దీనిలో భాగంగా నిర్వహించిన ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల ప్రాంతీయ సమీక్షా సమావేశం తీవ్ర రచ్చకు దారి తీసింది. సీనియర్ నాయకులు, క్షేత్రస్థాయి నాయకులకు మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. వేర్వేరు పార్టీల నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కొందరు నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాకు చెందిన గుర్రప్పనాయుడు పార్టీ ఇన్‌ఛార్జుల తీరును ప్రశ్నించారు. దీంతో ఆయన వ్యవహారంపై బాలినేని వర్గం తిరగబడింది. అదేసమయంలో మరికొందరు.. జిల్లాలకు ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్లను తీసేయాలని.. పార్టీలో ఆది నుంచి పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వాలనికోరారు.
ముఖ్యంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ హరి ప్రసాద్‌లు కూడా.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ పరిణామాలతో బాలినేని సహా అందరూ విస్తుబోయారు. ఇదంతా పార్టీలో వైసీపీ నుంచి వచ్చిన నాయకుల వల్లే జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. వారే కోవర్టులుగా మారి పార్టీని బలహీన పరుస్తున్నారని కొందరు నాయకులు వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలపై పార్టీ అధిష్టానానికి సమాచారం ఇస్తామని.. ఇలాంటి నాయకులపై చర్యలు తీసుకునే చూస్తామని సీనియర్లు తెలిపారు. అయితే.. క్షేత్రస్థాయిలో తమపై ఆధిపత్యం చేస్తే సహించేది లేదని మరికొందరు నాయకులు చెప్పడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates