తమిళనాడు రాజకీయాలు మూడు రోజులుగా రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే పార్టీకి ప్రజలు పట్టం కట్టినప్పటికీ మెజారిటీ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో విజయ్ నిలిచిపోయారు. టీవీకేకు ముందు మద్దతిస్తానని ప్రకటించిన సిపిఐ, సిపిఎం ఆ తర్వాత డిఎంకెతో పొత్తులో ఉన్నాం కాబట్టి బయటకు రాలేమని వెనక్కి తగ్గాయి.
పూర్తిస్థాయి మెజారిటీ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ రాజేంద్రన్ తేల్చి చెప్పారు. మరోవైపు డిఎంకె, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా పుకార్లు వచ్చాయి.
విజయ్ తో వీసీకే పార్టీ అధినేత లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. సీపీఐతో టీవీకే కీలక నేత నిర్మల్ కుమార్
భేటీ అయ్యారు. టీవీకేకు మద్దతిస్తున్నామని సిపిఐ అధికారికంగా లెటర్ విడుదల చేసింది. సిపిఎం ఎమ్మెల్యేలు కూడా టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు.
ఈ రోజు సాయంత్రం సిపిఐ, సిపిఎం నేతలు అధికారికంగా ప్రెస్ మీట్ నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మూడోసారి గవర్నర్ రాజేంద్రన్ ను కలిసేందుకు టీవీకే అధినేత విజయ్ అపాయింట్మెంట్ కోరారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు లోక్ భవన్ లో గవర్నర్ రాజేంద్రన్ తో విజయ్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
మొత్తం 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్ రాజేంద్రన్ ను కలిసేందుకు విజయ్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మూడు రోజులు పాటు తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తలపించేలా జరిగిన పరిణామాలకు ఈరోజు సాయంత్రంతో తెరపడే అవకాశం కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates