రజినీది పిరికితనమా?

మొత్తానికి రజినీకాంత్ తేల్చేశారు. తాను రాజకీయాల్లోకి రాబోనని ప్రకటించేశారు. ఇంతకు ముందు ప్రకటించినట్లు ఈ నెల 31న తాను రాజకీయ పార్టీని మొదలుపెట్టట్లేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వస్తానని చెప్పి, మాట తప్పుతున్నందుకు అభిమానులకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. ఈ నిర్ణయం రజినీ అభిమానులు ఎంత నిరాశకు గురి చేసి ఉంటుందో అంచనా వేయొచ్చు. వాళ్లు రజినీ రాజకీయ రంగ ప్రవేశంపై చాలా ఆశలతోనే ఉన్నారు. తాను రాజకీయాల్లోకి రానున్నట్లు సంకేతాలు ఇచ్చినప్పటి నుంచి వాళ్లు తమ సన్నాహాల్లో ఉన్నారు. అభిమాన సంఘాల నాయకులు టికెట్ల మీద ఆశలు పెట్టుకున్నారు. స్థానికంగా సేవా కార్యక్రమాలు చేస్తూ, రజినీ భావజాలాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 31న పార్టీ మొదలు పెట్టనున్నట్లు రజినీ ప్రకటన చేయడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఇంతలో రజినీ ఇప్పుడు బాంబు పేల్చారు.

అభిమానుల సంగతేంటి?
ఈ ప్రకటనను అభిమానులు జీర్ణించుకోలేకపోవచ్చు. కొంతమందికి రజినీది చాలామందికి పిరికితనంలా కనిపించొచ్చు. కానీ లాజిక్‌తో ఆలోచిస్తే ఆయనది సరైన నిర్ణయం అని అర్థమవుతుంది. రజినీ రాజకీయాల్లో ఉండటం ముఖ్యమా.. రజినీ క్షేమంగా ఉండటం ముఖ్యమా అన్న ప్రశ్న అభిమానులు అందరూ వేసుకోవాలి. కొన్నేళ్లుగా రజినీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. రెండు నెలలు ఆయన తీవ్ర అనారోగ్యంతో సింగపూర్‌లో చికిత్స చేయించుకున్నారు. మరో సందర్భంలో అమెరికాలో నెల రోజులకు పైగా ఉండి చికిత్స పొందారు. ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగింది. కరోనా పెద్ద వయస్కులు, అనారోగ్య సమస్యలు ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల కిందటే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడంతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలున్న బాలు.. కరోనాకు బలైన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. వారం రోజులు ఎన్నో జాగ్రత్తల మధ్య ‘అన్నాత్తె’ షూటింగ్ చేస్తేనే ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు. రజినీకి కరోనా సోకినట్లేమీ తేలకున్నా ఆయన బీపీ సమస్యలు ఎదుర్కొన్నారు.

ఆరోగ్యమే కారణం !
అలాంటిది రజినీ ఇప్పుడు పార్టీ పెట్టి జనాల్లో తిరిగితే కరోనా బారిన పడకుండా తప్పించుకోవడం కష్టమే. ఆయన అనారోగ్య సమస్యల దృష్ట్యా కరోనా సోకితే ప్రాణాలకే ముప్పుంటుంది. పార్టీ పెట్టి జనాల్లో తిరక్కుంటే ఆయన రాజకీయాల్లోకి రావడంలో అర్థం ఉండదు. కాబట్టి రజినీ విరమణ నిర్ణయం తప్పేమీ కాదు. ఆయనది పిరికితనం ఎంతమాత్రం కాదు. కాకపోతే ఆయన ఇంత కాలం ఆగకుండా రెండేళ్ల ముందే పార్టీ పెట్టి, క్షేత్ర స్థాయిలో నిర్మాణం చేసి ఉంటే ఇప్పుడు జనాల్లో తిరక్కుండా, వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండి, తర్వాత ప్రచారానికి వెళ్లి ఉండొచ్చు. కానీ పార్టీ మొదలుపెట్టడంలో ఆలస్యం జరిగింది. ఇప్పటికిప్పుడు పార్టీ పెడితే అన్ని పనులూ పక్కన పెట్టి దాన్ని బలోపేతం చేసేందుకు జనాల్లో తిరగాలి. అది ఆయన ఆరోగ్యానికి ప్రమాదం కాబట్టి రజినీ నిర్ణయం సరైందే అని అర్థం చేసుకోవాలి.