విజయ్ కు లైన్ క్లియర్ చేసిన స్టాలిన్?

తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కావడం లాంఛనమే అంతా భావించిన తరుణంలో ఆ పార్టీ అధినేత విజయ్ కు అనుకోని చిక్కులు ఎదురు వచ్చాయి. కాంగ్రెస్ కు చెందిన 5గురు ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతిచ్చినా….సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి చిన్న పార్టీలు టీవీకేకు ఇంకా మద్దతివ్వలేదు. ఈ నేపథ్యంలోనే విజయ్ సీఎం సీటుకు లైన్ క్లియర్ అయ్యేలా మాజీ సీఎం స్టాలిన్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది.

డీఎంకే మిత్రపక్షాలైన వీసీకే, సీపీఐ, సీపీఎం నేతలతో డీఎంకే అధినేత స్టాలిన్ భేటీ అయ్యారు. విజయ్ కు మద్దతిచ్చే అంశంపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని స్టాలిన్ అన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉద‌యం వీసీకే, సీపీఐ, సీపీఎంలు భేటీ కాబోతున్నాయి. ఆ త‌ర్వాత టీవీకేకు ఆ పార్టీలు మ‌ద్ధ‌తిస్తాయా లేదా అన్న విషయంపై క్లారిటీ రానుంది.

మరోవైపు, డీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్నాడీఎంకే రెడీ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ సీఎం పళని స్వామి ఖండించారు. ఇక, అన్నాడీఎంకే నుండి విజ‌య్ తో 25మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా, శుక్రవారం మధ్యాహ్నానికి విజయ్ కు ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. సీఎం విజయ్ రియల్ లైఫ్ సినిమా స‌స్పెన్స్ కు రేపు తెర‌ప‌డే అవకాశముంది.