తెలంగాణలోని కరీంనగర్ లో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల వాహనాలు, క్యాంప్ కార్యాలయాలపై బీజేపీ శ్రేణులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో బీఆర్ఎస్ నేతల కార్లు ధ్వంసం కాగా… క్యాంప్ కార్యాలయాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడులకు పాల్పడ్డ వారు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులుగా భావిస్తున్నారు. ఈ దాడుల్లో బీఆర్ఎస్ నేతలకు ఏమీ కాలేదు.
ఇక ఈ దాడికి దారి తీసిన కారణాలేమిటన్న విషయానికి వస్తే… బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేటీఆర్ పై బీజేపీ నేతలు డ్రగ్స్ ఆరోపణలు గుప్పిస్తుంటే… వాటిని ఖండించే క్రమంలో బీఆర్ఎస్ నేతలు కూడా తమదైన శైలిలో సంచలన ఆరోపణలు గుప్పిస్తున్నారు.
అందులో భాగంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి… బండి సంజయ్ పై డ్రగ్స్ ఆరోపణలు చేశారు. బండి సంజయ్ తంబాకు వినియోగిస్తారని, ఆ తంబాకులో డ్రగ్స్ కలుపుకుని వాడి ఉంటారని అన్నారు. అంతటితో ఆగని పాడి… ఆ డ్రగ్స్ వినియోగం కారణంగానే సైడ్ ఎఫెక్ట్ ల కారణంగా బండి సంజయ్ వెంట్రుకలన్నీ రాలిపోయాయని, అందుకే సంజయ్ తల బట్టతలగా మారిందని తమకు అనుమానాలున్నాయని ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు విన్నంతనే బండి సంజయ్ అనుచరులు ఆగ్రహానికి గురయ్యారు. కరీంనగర్ లోని వీధుల్లోకి కర్రలు చేతబట్టుకుని ఎంట్రీ ఇచ్చిన బీజేపీ శ్రేణులు… తమకు కనిపించిన పాడి కారుపై దాడికి దిగారు. ఈ దాడిలో కౌశిక్ రెడ్డి కారు అద్దాలు పగిలిపోయాయి.
అంతటితో శాంతించని బీజేపీ శ్రేణులు… అక్కడికి సమీపంలోనే ఉన్న కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపైకి దూసుకుని వెళ్లారు. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు అప్పటికే అక్కడికి చేరుకుని బీజేపీ శ్రేుణులను అడ్డుకున్నారు. ఈ దాడుల కారణంగా కరీంనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates