తమిళనాడులో రాజకీయాలు రోజుకోరకంగా మారుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన.. టీవీకే.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మరో 10 స్థానాలకు దూరంలో నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే.. రాష్ట్రపతి పాలన తప్పదు. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. ఈ నేపథ్యంలో తమతో కలిసి వచ్చే పార్టీలకు చేతులు చాచింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఈ పార్టీకి.. తాజా ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ క్రమంలో రెండు మంత్రి పదవులు తీసుకుని.. విజయ్ పార్టీకి సహకరించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.
దీంతో ఇప్పటి వరకు డీఎంకే(తాజా ఎన్నికల్లో అధికారం కోల్పోయిన పార్టీ)తో పొత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ బంధాన్ని తెంచుకునేందుకు రెడీ అయింది. వాస్తవానికి కాంగ్రెస్-డీఎంకేలది ఇప్పటి బంధం కాదు. దాదాపు 55 సంవత్సరాల నుంచి ఈ రెండు పార్టీలూ ఓడినా.. గెలిచినా.. పొత్తులతోనే ముందుకు సాగుతున్నాయి. మధ్యలో ఓ సారి అన్నా డీఎంకేతో పొత్తు కుదిరినా.. అప్పటి డీఎంకే అధినేత కరుణానిధి జోక్యంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలోనే 55 ఏళ్లుగా ఈ రెండు పార్టీలూ కలిసిముందుకు సాగుతున్నాయి. కానీ, తాజా ఎన్నికల్లో టీవీకేతో పొత్తు కోసం డీఎంకేతో బందాన్ని వదులుకుంది.
వచ్చే ఎన్నికల నాటికి..
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డీఎంకేతో తమ బంధం పూర్తిగా తెగిపోలేదని.. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ పొత్తు పెట్టుకుంటామని పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పడితే.. దానిని అడ్డు పెట్టుకుని బీజేపీ పుంజుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించింది. అందుకే తాము టీవీకేతో చేతులు కలపాల్సి వస్తోందని.. సర్దుబాటు ధోరణిలో వ్యాఖ్యానించింది. ఇది కేవలం ప్రభుత్వమనుగడ కోసం.. తమిళనాడు అస్తిత్వాన్ని కాపాడేందుకు.. రాజకీయంగా రాష్ట్రంలో ఎలాంటి విచ్ఛిన్నకర పరిస్థితులు రాకుండా చూసేందుకు తీసుకున్న నిర్ణయంగా పేర్కొంది.
డీఎంకే ఏమందంటే..
అయితే.. కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై డీఎంకే సారథి స్టాలిన్ నిప్పులు చెరిగారు. అవకాశ వాద పార్టీగా కాంగ్రెస్‌ను అభివర్ణించారు. ఎన్నికలకు ముందు కూడా తమతో దోబూచులాడిందని.. విమర్శలు గుప్పించారు. అందుకే.. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గుతోందన్నారు. కేవలం రెండు మంత్రి వర్గ సీట్ల కోసం.. నమ్మకమైన బంధాన్ని వదులుకుంటున్నారని ఆయన ఆక్షేపించారు. ఈ పరిణామాలపై టీవీకే మాత్రం మౌనంగా ఉంది. తమతో కలిసి వచ్చే పార్టీలకు ప్రాధాన్యం ఉంటుందని టీవీకే నేతలు ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటు ఇప్పుడు తమ ముందున్న ప్రధాన కర్తవ్యంగా పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates