విజయ్ చాణక్యుడు పీకే కాదు

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారని ఇన్నాళ్లూ జరిగిన ప్రచారంలో అస్సలు నిజం లేదని తేలిపోయింది. పీకే ఇంటర్వ్యూలు చూసి అందరూ ఆయనే స్క్రిప్ట్ రాస్తున్నారనుకున్నారు కానీ, తెరవెనుక కథ నడిపింది మాత్రం మధ్యప్రదేశ్‌కు చెందిన కపిల్ సాహూ అనే యువకుడు. ఇతనికి 9 ఏళ్ల అనుభవం ఉంది. ఐప్యాక్ లాంటి పెద్ద సంస్థల నుండి బయటకు వచ్చి, పాత పద్ధతులకు భిన్నంగా సరికొత్త వ్యూహాలతో విజయ్ పార్టీని ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టాడు. అందరూ పీకే వైపు చూస్తుంటే, ఈ సైలెంట్ మేధావి మాత్రం తన పని తాను పూర్తి చేసేశాడు.

కపిల్ సాహూ వ్యూహం ఏంటంటే.. కేవలం విజయ్ గ్లామర్ మీద డిపెండ్ అవ్వకుండా, గ్రౌండ్ లెవల్ లో డేటాను బలంగా వాడుకున్నాడు. గతంలో ఢిల్లీ లాంటి చోట్ల తన సత్తా చాటిన అనుభవంతో, తమిళనాట దశాబ్దాల చరిత్ర ఉన్న పెద్ద పార్టీల ఓటు బ్యాంకుకు ఎలా గండి కొట్టాలో ఒక పక్కా ప్లాన్ ఇచ్చాడు. అభ్యర్థుల ఎంపిక నుంచి నియోజకవర్గాల బలాబలాల వరకు విజయ్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక కపిల్ సాహూ టీమ్ కష్టం స్పష్టంగా కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో విజయ్ ఇమేజ్ ను ఎలా బిల్డ్ చేయాలి, డిజిటల్ క్యాంపెయిన్స్ ద్వారా యువతను ఎలా ఆకర్షించాలి అనే విషయంలో ఈ టీమ్ అద్భుతమైన రిజల్ట్స్ రాబట్టింది. ప్రశాంత్ కిషోర్ లాంటి దిగ్గజాల మాటలు వినడానికే బాగుంటాయి కానీ, ఫీల్డ్ లోకి వెళ్ళి పని చేయడంలో కపిల్ సాహూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ఏ సామాజిక వర్గాన్ని ఎలా కలుపుకోవాలి అనే విషయంలో ఇతను చేసిన సర్వేలే ఇవాళ టీవీకే పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయి.

కేవలం రాజకీయ వ్యూహకర్తగానే కాకుండా, పార్టీ నిర్మాణం లోనూ విజయ్ కి కపిల్ ఒక వెన్నెముకలా నిలిచాడు. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పటిష్టమైన పార్టీల మధ్య ఒక కొత్త పార్టీ అతిపెద్ద శక్తిగా ఎదగడం వెనుక ఇతని చాణక్యం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పీకే తో కేవలం చర్చలే జరిగాయి కానీ, యుద్ధ రంగంలో విజయ్ ని గెలిపించిన సైన్యాధ్యక్షుడు మాత్రం కపిల్ సాహూనే. ఇప్పుడు దేశవ్యాప్తంగా కపిల్ సాహూ పేరు మారుమోగిపోతోంది. ప్రశాంత్ కిషోర్ లాంటి బ్రాండ్లను కాదని, ఒక కొత్త వ్యూహకర్త ఇలాంటి సంచలనం సృష్టించడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ సినిమాల్లో ఎలాగైతే తన డైలాగ్స్ తో మేజిక్ చేస్తాడో, కపిల్ సాహూ తన తెలివితేటలతో తెరవెనుక అదే రేంజ్ లో మేజిక్ చేసి చూపించాడు.