ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో ఒక పెను సంచలనం. ఆ తర్వాత ఎవ్వరూ ఆ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. 2009 ఎన్నికల ముంగిట ఎన్టీఆరే రికార్డే లక్ష్యంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు కానీ.. సీఎం కావాలన్న ఆయన లక్ష్యం నెరవేరలేదు.
ఐతే ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లలో అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ తర్వాత అతి తక్కువ సమయంలో సీఎం అయిన నేతగా రెండో స్థానంలో నిలిచారు. తమిళనాడు వరకు ఇది రికార్డు. ఐతే పార్టీ పెట్టాక రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తిరగకపోయినా.. ఎన్నికల ముంగిట ఎక్కువ సభలు పెట్టకపోయినా.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా.. మీడియాలో తనకు కవరేజీ ఆశించిన స్థాయిలో దక్కకపోయినా.. కరూర్ ఘటన సహా తన ప్రతిష్ఠను దెబ్బ తీసే ఉదంతాలు చోటు చేసుకున్నా.. అన్నింటినీ దాటి అధికారంలోకి రావడం అనూహ్యం.
తమిళ రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విజయం పట్ల ఆశ్చర్యపోతున్నారు. విజయ్ కింగ్ మేకర్ కావచ్చనుకున్నాం కానీ.. ‘కింగ్’ కావడం మాత్రం నమ్మశక్యంగా లేదని అంటున్నారు.
ఐతే విజయ్ అద్భుత విజయం వెనుక ఎన్నో ఏళ్ల ముందు వేసిన పునాదే కారణమనే చర్చ జరుగుతోంది. విజయ్ కోసం దశాబ్దంన్నర కిందట వేల సంఖ్యలో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. వాటన్నంటినీ ఏకతాటిపైకి తెచ్చి ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాడు విజయ్. ఏకంగా 85 వేల రిజిస్టర్డ్ అభిమాన సంఘాలు విజయ్ కోసం ఏర్పాటు కావడం విశేషం.
ఈ సంఘాల ద్వారా ఎప్పట్నుంచో సేవా కార్యక్రమాలు చేపడుడూ.. ఫ్యాన్స్ ప్రజలతో మమేకం అయ్యేలా చూసుకున్నాడు విజయ్. కొవిడ్ టైంలోనే కాక వివిధ సందర్భాల్లో విజయ్ అభిమానులు భారీ ఎత్తున చేసిన సేవా కార్యక్రమాలు జనాలకు తనపై సానుకూల భావన తీసుకొచ్చాయి. అభిమానుల్లో కూడా ఎవరికైనా కష్టం వస్తే ఫ్యాన్స్ అసోసియేషన్ల తరఫున వారికి సాయం అందేది.
విజయ్ కూడా అభిమాన సంఘాల కోసం నిధులు అందజేసేవాడు. పార్టీ పెట్టడానికి ముందు కూడా అభిమాన సంఘాలతోనే సమావేశమై ఎన్నికల కోసం ఎలా పని చేయాలో దిశానిర్దేశం చేశాడు. వాళ్లు యువతను తమ పార్టీ వైపు ఆకర్షితులను చేయడంలో విజయవంతం అయ్యారు.
ప్రధాన పత్రికలు, టీవీ ఛానెళ్లు తనకు తగినంత కవరేజీ ఇవ్వకపోయినా విజయ్ పట్టించుకోలేదు. ఇంటర్వ్యూలు అడిగిన వాళ్లకు తిరస్కరించాడు. బలమైన సోషల్ మీడియా, డిజిటల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా జెన్జీకి కనెక్ట్ కావడానికి ఏం చేయాలో అదంతా చేశాడు.
అభిమానులు ఏదీ ఆశించకుండా విజయ్ కోసం పని చేశారు. తాము ఓట్లు వేయడంతో పాటు ఓట్లు వేయించారు. ప్రభుత్వ వ్యతిరేకత సహా మిగతా అంశాలు కూడా కలిసొచ్చి విజయ్ ఈ అద్భుత విజయాన్నందుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే విజయ్‌కి అభిమానులు అందించిన విజయమే ఇది.
Gulte Telugu Telugu Political and Movie News Updates