విజయ్ మాత్రమే కాదు.. డ్రైవర్ కొడుకు కూడా

నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే మిగతా నాలుగు చోట్లా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే ఫలితాలు వస్తున్నాయి. కానీ తమిళనాట మాత్రం సంచలనం తప్పలేదు. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ విజయ్ పార్టీ టీవీకే 30 లోపు సీట్లే సాధిస్తాయని అంచనా వేశాయి.

యాక్సిస్ ఇండియా మాత్రమే టీవీకేకు వందకు పైగా సీట్లు రావచ్చని పేర్కొంది. కానీ చాలామంది ఆ నంబర్ టూమచ్ అని కొట్టిపారేశారు. కానీ అనూహ్యంగా ఆ సంస్థ చెప్పినట్లే టీవీకే ఫలితాలు రాబడుతోంది. మ్యాజిక్ ఫిగర్‌కు అత్యంత చేరువగా ఉన్న టీవీకే.. అధికారం చేపట్టడం లాంఛనమే. కొన్ని సీట్లు తగ్గినా.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల నుంచి కొందరు జంపింగ్ జపాంగ్‌లు టీవీకేలోకి వచ్చేస్తారనడంలో సందేహం లేదు. కాబట్టి విజయ్ సీఎం కావడం లాంఛనమే.

విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల నుంచి విజయం సాధించడం విశేషం. పెరంబూరు, తిరుచ్చిరాపల్లి.. రెండు స్థానాల్లోనూ విజయ్‌కి మంచి మెజారిటీ వచ్చింది. వాటిలో ఏదో ఒక స్థానం నుంచి ఆయన రాజీనామా చేసి ఆరు నెలల్లోపు ఇంకో అభ్యర్థిని గెలిపించుకోవడమూ లాంఛనమే.

ఈ ఎన్నికల్లో విజయ్ అనేకమంది సామాన్యులకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. అందులో ఆయన వ్యక్తిగత డ్రైవర్ కొడుకు శబరినాథన్ కూడా ఉండడం విశేషం. విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి శబరినాథన్ విజయం సాధించడం లాంఛనమే.

అధికార డీఎంకే పార్టీ నుంచి ప్రభాకర్ రాజా అనే సీనియర్ నేతను శబరినాథన్ ఓడించి సంచలనం రేపాడు. ఇంకా కొందరు సామాన్యులు ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. విజయ్ పెద్దగా ప్రభావం చూపించడేమో అన్న అంచనాతో ఇతర పార్టీల నేతలు ఆ పార్టీలో చేరలేదు. దీంతో చాలా వరకు అభిమాన సంఘాల నాయకులు, విద్యావంతులు, సామాన్యులకు విజయ్ అవకాశం ఇచ్చాడు. దీంతో 1984లో తెలుగుదేశం తరహాలోనే టీవీకే ఒక కొత్త ఒరవడికి తెరతీయబోతోంది.