వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్.. శనివారం సతీ సమేతంగా యూరప్(బ్రిటన్ సహా.. ఇతర దేశాలు) పర్యటనకు వెళ్లారు. వచ్చే మే 15వ తేదీ వరకు ఆయన విదేశాల్లో ఉండనున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి కూడా ఇచ్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా తన సొంత నియోజకవర్గం పులివెందులలో రెండు రోజుల పర్యటనకు వెళ్లిన జగన్.. అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతోనూ భేటీ అయ్యారు. ప్రజలతోనూ మమేకమయ్యారు. అనంతరం.. శుక్రవారం ఆయన బెంగళూరుకువెళ్లి.. అక్కడి నుంచి యూరప్ పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను మళ్లీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డికే అప్పగించారని చెబుతున్నారు.
గతంలోనే వివాదం..
గతంలో కూడా జగన్ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు.. పార్టీ బాధ్యతలను సజ్జలకు అప్పగించారు. ఆ సమయంలోనే పార్టీలో అనేక వివాదాలు తెరమీదికి వచ్చాయి. నాయకులకు సరైన గైడెన్స్ ఇవ్వకపోవడంతో పాటు సమయానికి సరిగ స్పందించలేదని నాయకులు సజ్జలపై ఫిర్యాదులు చేశారు. ఇక, ఆ తర్వాత కొన్ని రోజులు సజ్జల ప్రమేయం తగ్గినా.. ఇప్పుడు మరోసారి పార్టీ బాధ్యతలను సజ్జలకు అప్పగించడంపై పార్టీలో విమర్శలు వస్తున్నాయి.
కీలక సమయంలో..
ప్రస్తుతం పార్టీకి కీలక సమయం నడుస్తోంది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటు, రైతులకు విత్తనాలు.. మరోవైపు ఉత్పత్తుల కొనుగోలు, ధాన్యం విక్రయాలు వంటి అంశాలపై ప్రజలలోకి వెళ్లాలని జగన్ ఇటీవలే దిశానిర్దేశం చేశారు. కానీ.. ఈ సమయంలోనే ఆయన రాష్ట్రం వదిలి విదేశాలకు వెళ్తున్నారు. ఇలాంటి కీలకసమయంలో సజ్జలకు బాధ్యతలు అప్పగించడంపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల్లోనే పెదవి విరుపులు కనిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates