ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరచుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం చాలా మామూలు వ్యవహారం అయిపోయింది. ఏడాదిన్నర పాలనలో ఎన్నెన్ని వివాదాలో లెక్కే లేదు. ఇంతకుముందెన్నడూ చూడని విచిత్రాలు ఏపీలో ఈ ఏడాదిన్నరలోనే జరిగాయి. తాజాగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరిగిన ఓ పరిణామం సంచలనం రేపింది.
ఇటీవలే జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం కింద వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున పూచీకత్తు లేకుండా రుణాలిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వగా.. బ్యాంకులు అందుకు నిరాకరిస్తున్నాయి. ఉయ్యూరులోని ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు శాఖలు ఈ పథకం కింద లోన్లు ఇవ్వనందుకుగాను వాటి కార్యాలయాల ముందు చెత్త పోయడం చర్చనీయాంశం అయింది.
అక్కడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మున్సిపల్ శాఖ అధికారుల సహకారంతోనే ఈ పని చేశారు. ఇలా ఎందుకు చేసింది నోట్ కూడా పెట్టడం గమనార్హం. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. వైకాపా నేతలు, అధికారుల తీరు తీవ్ర విమర్శల పాలైంది. బ్యాంకులతో వ్యవహారం కావడంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుని రాష్ట్ర ఆర్థిక మంత్రితో మాట్లాడింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్‌ను బాధ్యుడిని చేస్తూ ఆయనపై వేటు వేసింది. ఐతే ఈ పనికి ప్రధానంగా బాధ్యత వహించాల్సింది స్థానిక నాయకులే అన్నది అక్కడి వారి మాట. మున్సిపల్ శాఖ నుంచి వారికి సహకారం అంది ఉండొచ్చు. అలాంటిది నాయకులపై ఏ చర్యలూ లేకుండా మున్సిపల్ కమిషనరన్‌పై వేటు వేయడమేంటన్నా ప్రశ్నా తలెత్తుతోంది. ఐతే ఈ చెత్త పని తాలూకు సెగ మాత్రం అధికార పార్టీకి, ప్రభుత్వానికి గట్టిగానే తగినట్లుందన్నది స్పష్టం.