వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో అనంతబాబును సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అనంతబాబును అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిన పోలీసులు ఆయనను సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతబాబు అరెస్టు సమయంలో ఆయన వెంట ఆయన సతీమణి లక్ష్మీదుర్గ కూడా ఉన్నారు. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అనంతబాబు అరెస్టు కావడంతో ఆపై పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారన్న దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
వైసీపీ అధికారంలో ఉండగా… తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే యువకుడిని హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కున్న అనంతబాబు… డెడ్ బాడీని బాధితుడి ఇంటి వద్ద డెలివరీ చేసి వార్తల్లోకెక్కారు. ఈ కేసులో అరెస్టు అయిన అనంతబాబు ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఈ కేసును పూర్తిగా కొట్టివేయించుకునే దిశగా అడుగులు వేసిన అనంతబాబు… కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్న నలుగురు వ్యక్తులను కిడ్నాప్ చేసి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా తనకు అనుకూలంగా సాక్ష్యం చెబితే డబ్బు కూడా ఇస్తానని ఆయన బేరానికి దిగారు.
సాక్షులను బెదిరించిన వైనంపై సమాచారం అందుకున్న పోలీసులు సాక్షులను నిర్బంధించిన ప్రదేశానికి వెళ్లగా… కారుతో పాటు సర్కారు తనకు కేటాయించిన గన్ మెన్లను అక్కడే వదిలేసి అనంతబాబు పరారయ్యారు. ఈ సందర్భంగా బైక్ పై పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న అనంతబాబు… కోర్టుకు రాక తప్పలేదు. బెయిల్ షరతులను తుంగలో తొక్కుతూ సాక్షులను ప్రభావితం చేశారన్న ఆరోపణలను చూపిస్తూ అనంతబాబు బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ విచారణకు రాకుంటే అనంతబాబు బెయిల్ దానికదే రద్దు అయిపోతుంది. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్నప్పటికీ అనంతబాబు కోర్టు విచారణకు రాక తప్పలేదు. కోర్టు విచారణ ముగించుకుని బయటకు వచ్చిన అనంతబాబును పోలీసులు కోర్టు ప్రాంగణంలోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతబాబు అరెస్టుతో ఇక ఆయనకు శిక్ష పడటం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే… అనంతబాబు రాజకీయ జీవితం ముగిసినట్టేనని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates