వైసీపీ అనంతబాబు కథ ముగిసినట్టేనా?

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే…తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే యువకుడిని చంపేసి… అతడి శవాన్ని డోర్ డెలివరీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కున్న అనంతబాబు ఆ కేసులో పీకల్లోతు కష్టాల్లో పడిపోయారు. ఇప్పటికే ఈ కేసు విచారణ పూర్తిగా కాగా… నేరాభియోగాల నమోదు ప్రక్రియ మొదలు కానుంది.

ఇది ముగిస్తే… అనంతబాబు భవిష్యత్తు ఏమిటన్నది తేలిపోనుంది. అయితే ఈ నేరాభియోగాల నమోదును తనకు అనుకూలంగా మలచుకునేందుకు యత్నించిన అనంతబాబు అడ్డంగా బుక్కైపోయారు. నేడో, రేపో ఆయన బెయిల్ కూడా రద్దు కాబోతున్నట్లు సమాచారం. మొత్తంగా అనంతబాబు కథ ముగిసినట్టేనని చెప్పక తప్పదు.

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుతో పాటు ఆయన సతీమణి లక్ష్మీ దుర్గపైనా నిందితురాలిగా ఉన్నారు. ఇప్పటికే ఇదే కేసులో అనంతబాబు బెయిల్ పై ఉండగా… లక్ష్మీ దుర్గను ఇటీవలే పోలీసులు రోజుల తరబడి విచారించారు. తాజాగా ఈ కేసు విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 24,25 తేదీల్లో నేరాభియోగాల నమోదును కోర్టు చేపట్టనుంది.

ఇందులో ఈ కేసు సాక్షులు ఇచ్చే వాంగ్మూలాలు అనంతబాబు భవిష్యత్తును నిర్ధారించనున్నాయి. ఇప్పటికే ఓ దఫా సాక్షులు అనంతబాబుకు వ్యరేతికంగానే వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా ఇచ్చే వాంగ్మూలం కూడా గతంలో మాదిరే అనంత బాబుకు వ్యతిరేకంగా ఉంటే… ఆయనకు శిక్ష తప్పదు.

ఇదే విషయాన్ని గ్రహించిన అనంతబాబు ఈ కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్న నలుగురు వ్యక్తులను తన వైపునకు తిప్పుకునే యత్నం చేశారన్న వార్త సంచలనంగా మారింది. అందులో భాగంగా వారిని ఓ గదికి రప్పించిన అనంతబాబు… వారిని అందులో నిర్బంధించి వారికి డబ్బు ఎరవేసి… తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పి తీరాల్సిందేనని భయపెట్టారు. తాను ఇచ్చే డబ్బు తీసుకోకున్నా చంపేస్తానని వారి చేతిలో డబ్బు పెట్టారు. ఒక్కో వ్యక్తికి రూ.3 లక్షలు మాట్లాడిన అనంతబాబు… అందులో రూ.1 లక్షను అడ్వాన్స్ గా ఇచ్చారు. ఇక మిగిలిన మొత్తాన్ని సాక్ష్యం చెప్పాక ఇస్తానని చెప్పారు.

అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ తంతు ఎలాగోలా పోలీసుల కంటబడిపోయింది. అంతే… రంగంలోకి దిగిన పోలీసులు… సాక్షులను అనంతబాబు అనుచరులు నిర్బంధించిన అపార్ట్ మెంట్ వద్దకు చేరిపోయారు. ఈ విషయాన్ని పసిగట్టిన అనంతబాబు తన కారుతో పాటు గన్ మెన్లను అక్కడే వదిలేసి బైక్ పై పరారయ్యారు.

ఇక పోలీసులు అక్కడికి చేరుకున్నాక సాక్షులను విచారించి… తమకు అందిన సమాచారం మొత్తం నిజమేనని నిర్ధారించుకుని…అనంతబాబుపైనా, ఆయన తరఫున ఈ తంతును సాగిస్తున్న ఆయన ప్రధాన అనుచరుడు, వైసీపీ బీసీ సెల్ నేత మాగంటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. రాంబాబును అరెస్టు చేశారు. ఇక సాక్షులను ప్రభావితం చేయడానికి యత్నిస్తే.. బెయిల్ రద్దు చేస్తామన్న కోర్టు ఉత్తర్వులను ఆధారం చేసుకుని పోలీసులు అనంతబాబు బెయిల్ రద్దు దిశగా చర్యలు చేపట్టారు.