నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాజ‌కీయ ప‌రమైన విమ‌ర్శ‌ల‌తో దూసుకుపోయారు. అయితే.. ఆమె ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా.. సొంత సొద‌రుడు.. కేటీఆర్ స‌హా కుటుంబ స‌భ్యుడు హ‌రీష్‌రావుపైనా విమ‌ర్శ‌లు గుప్పించినా.. త‌న‌ తండ్రి, బీఆర్ ఎస్ పార్టీ అదినేత కేసీఆర్‌ను మాత్రం ప‌క్క‌న పెట్టారు. ఆయ‌న జోలికి పెద్ద‌గా వెళ్ల‌లేదు. వెళ్లినా.. ప‌రోక్షంగా మాత్ర‌మే స్పందించారు.

కానీ.. పార్టీ ఆవిర్భావానికి స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో క‌విత త‌న పంథాను పూర్తిగా మార్చుకున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ను ఏమీ అన‌కుండా.. తాను ఎన్ని రాజ‌కీయాలు చేసినా.. ప్ర‌జ‌లు ప‌ట్టించుకోర‌ని భావించారో లేక‌.. కేసీఆర్ వంటిబ‌ల‌మైన నాయ‌కుడితో త‌ల‌ప‌డితే త‌ప్ప‌.. త‌న ప్ర‌త్యేక‌ రాజ‌కీయాలు దారిలో ప‌డ‌వ‌ని అనుకున్నారో కానీ.. ఏకంగా ఇప్పుడు కేసీఆర్ సెంట్రిక్‌గానే విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గిత్యాల‌లో సోమ‌వారం నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌ను కార్నార్ చేస్తూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ముఖ్యంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను క‌విత త‌ప్పుబ‌ట్టారు. బీఆర్ఎస్‌ను ప్ర‌జ‌లు ఓడించార‌ని అన‌డంపై విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌జ‌లను త‌ప్పుబ‌డుతున్న కేసీఆర్‌.. వాస్త‌వాల‌ను ఇప్ప‌టికీ తెలుసుకోవ‌డం లేదేన్నారు. అధికారంలో ఉండ‌గా.. ప్ర‌జ‌ల మ‌ద్య‌కు ఎప్పుడైనా వ‌చ్చారా? అని ఆమె నిల‌దీశారు. అంతేకాదు.. ప్ర‌జల స‌మ‌స్య‌ల‌పై ఏనాడైనా స‌మీక్ష‌లు చేశారా? అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుబ‌డుతున్నార‌ని ఎద్దేవా చేయ‌డం ద్వారా.. కేసీఆర్‌కు చుర‌క‌లు అంటించారు.

అంతేకాదు.. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు ఛాన్స్‌లేద‌ని.. మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌ర‌ని చెప్ప‌డం ద్వారా నేరుగా కేసీఆర్ అస్తిత్వాన్ని దెబ్బ‌తీసేలా క‌విత ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. వాస్త‌వానికి తెలంగాణ ఉద్య‌మాన్ని.. మ‌హిళ‌ల‌ను.. కేసీఆర్ ప్ర‌స్తావించారు. ఈ విష‌యాల‌నే క‌విత టార్గెట్ చేసుకోవ‌డం ద్వారా.. త‌న తండ్రితోనూ తాను త‌ల‌ప‌డ‌గ‌ల‌న‌ని.. స్ప‌ష్టం చేశారు. మొత్తంగా.. మంగ‌ళ‌వారం నాటి మీడియా స‌మావేశంలో ఇత‌ర అంశాలు ఎలా ఉన్నా.. కేసీఆర్‌ను టార్గెట్ చేయ‌డం ద్వారా.. త‌న రాజ‌కీయ అడుగులు ఎలాగైనా ప‌డ‌తాయ‌న్న సందేశాన్ని క‌విత స్ప‌ష్టం చేశారు.