తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు తెలుగువారి మధ్య విభేదాలకు దారి తీసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, పార్లమెంట్ ఆమోదంతోనే ఇది అమల్లోకి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజల మధ్య ద్వేషాలు రగిలే అవకాశం ఉందని హెచ్చరించారు.
ముఖ్యంగా తేజస్వి సూర్య చేసిన భారత్–పాకిస్తాన్ పోలిక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, అలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు.
ఈ తరహా వ్యాఖ్యలను కట్టడి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకత్వంపై ఉందని చంద్రబాబునాయుడికి విజ్ఞప్తి చేశారు. అలాగే తేజస్వి సూర్య వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేందుకు స్పీకర్‌కు లేఖ రాయాలని కూడా సూచించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు తెలంగాణ ఉద్యమం, ప్రజల ఆకాంక్షలు బాగా తెలుసని గుర్తుచేశారు. దశాబ్దాల పాటు సాగిన ఉద్యమం, అమర వీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాలను సరిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజలు పోరాడారని వివరించారు.
2014లో సోనియా గాంధీ సారథ్యంలో, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో పార్లమెంట్ ఆమోదంతో రాష్ట్ర విభజన జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అప్పటి నుంచి రెండు రాష్ట్రాలు తమ తమ దారిలో అభివృద్ధి పథంలో సాగుతున్నాయని చెప్పారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ సంబంధాల పరంగా ఇరు రాష్ట్రాల ప్రజలు పరస్పర ఆధారంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. పెళ్లి సంబంధాలు సహా సామాజిక బంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
రెండు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇలాంటి సమయంలో విభజనను భారత్–పాకిస్తాన్‌తో పోల్చడం పూర్తిగా తప్పుదారి పట్టించే వ్యాఖ్య అని మండిపడ్డారు. తెలుగువారంతా ఐక్యంగా, పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates