బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మేడిగడ్డ పరిశీలనకు వెళ్తున్నానని తెలిసే.. కేసీఆర్ జగిత్యాలలో సభ పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. మేడిగడ్డను పరిశీలించి.. ప్రజలకు నిజాలను చెబుతానన్న భయం ఉందని.. అందకే కేసీఆర్ డబుల్ స్టాండర్డ్ రాజకీయాలకు తెరదీశారని విమర్శించారు. మేడిగడ్డను నంజుకుతిన్నారని.. లక్షా 50 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు ద్వారా రైతులకు ఎలాంటి మేలు జరగలేదని వ్యాఖ్యానించారు. దీనిపై విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరామని.. కానీ, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తాజాగా సోమవారం సాయంత్రం.. మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులతో కలిసి.. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడిగడ్డ పరిశీలనకు వెళ్లారు. హెలికాప్టర్ నుంచే ప్రాజెక్టును ఏరియల్ సర్వే చేశారు. అనంతరం.. జలవనరుల శాఖ అధికారులతో అక్కడే సమీక్షించారు. మేడిగడ్డ రిజర్వాయర్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. దీనిని చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని అప్పట్లో కేసీఆర్ ప్రయత్నించారని వ్యాఖ్యానించారు. కానీ, తాను ఒకటి తలస్తే.. ప్రకృతి మరొకటి తలచిందని కేసీఆర్ భాగోతం తర్వాత బయట పడిందని విమర్శించారు.
మీడియాతో..
అనంతరం.. రేవంత్ రెడ్డి మేడిగడ్డపై సుదీర్ఘంగా మీడియాకు వివరించారు. లక్షా 50 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా అవినీతి చేశారని ఆరోపించారు. దీనిలో లక్ష కోట్ల రూపాయలను ఇప్పటికే కాంట్రాక్టర్లకు అప్పగించి.. అటు నుంచి కమీషన్లు తీసుకున్నారని చెప్పారు. దీనిపై విచారణ చేయాలని కేంద్రానికి తాము అప్పగించినా.. కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మరోసారి ఇటీవల కూడా దీనిపై లేఖ రాశామన్నారు. దీనిని తాము వదిలి పెట్టేది లేదన్నారు. మేడిగడ్డ కుంగిపోవడం.. యాదృచ్ఛికం కాదని.. అవినీతి కారణంగానే అది కుంగిపోయిందని తెలిపారు. దీనిని విచారించాల్సిందేనని పట్టుబడుతున్నామన్నారు. సీబీఐకి అన్ని విధాలా సహకరిస్తామన్నారు.
కేసీఆర్ ఆటలు సాగవు..
కేసీఆర్ ఆటలు సాగవని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ నిజాలు బయట పడతాయన్న ఉద్దేశంతోనే తాను జగిత్యాలలో సభ పెట్టుకున్నారని ఆరోపించారు. అయినప్పటికీ.. ఆయన ఆటలు సాగవని.. నిజాలను ప్రజల ముందు పెడతామని అన్నారు. ఇక, జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై స్పందిస్తూ.. ఔట్ డేటెడ్ నాయకులు పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates