తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో మధ్య మధ్యలో తమిళ పదాలను ఉపయోగిస్తూ ప్రసంగించారు.
“అనైవరుక్కుం వణక్కం… ఎన్ అన్బాన తమిళ్ నాడు మక్కళే…” అంటూ సభను ప్రారంభించిన ఆయన, తన పుట్టినరోజు రోజున తమిళనాడులో ప్రజల మధ్య ఉండటం ప్రత్యేక ఆనందంగా ఉందని తమిళంలోనే చెప్పారు. ప్రారంభం నుంచే స్థానిక భాషలో మాట్లాడటం ద్వారా ప్రేక్షకులతో అనుబంధం పెంచుకునే ప్రయత్నం చేశారు.
అలాగే “మున్నేట్రం వేణ్డుమా… వేలైవాయుప్ప గళ్ వేణ్డుమా…” అంటూ అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల అంశాలను ప్రస్తావించారు. “అప్పడియానాల్ మధ్యతిల్ మోదీజీ ఇరుక్క వేణ్డుం… మానిలతిల్ అమ్మ ఆట్చి వర వేణ్డుం… ఇదుక్కు ఎన్డీఏ కూట్టణియై వెట్రి పెర చేయ్యుంగల్” అంటూ కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వం అవసరమని, రాష్ట్రంలో మాజీ సీఎం జయలలిత పాలనను గుర్తుచేస్తూ ఎన్డీఏ కూటమికి మద్దతు కోరారు.
ప్రసంగంలో ఆయన తమిళనాడు అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, యువతకు ఉపాధి అవకాశాలపై కూడా దృష్టి సారించారు. దక్షిణాదిలో అభివృద్ధి వేగవంతం కావాలంటే కేంద్ర-రాష్ట్ర సమన్వయం అవసరమని పేర్కొన్నారు.
గతంలో కూడా తమిళనాడులో ప్రచారం చేసినప్పటికీ, ఈ స్థాయిలో తమిళ భాషలో వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. స్థానిక సంస్కృతి, భాష పట్ల గౌరవాన్ని చూపుతూ మాట్లాడటం వల్ల సభకు వచ్చిన ప్రజల్లో సానుకూల స్పందన కనిపించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates