తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ప్రజల మధ్య ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ నెల 20 నుంచి ఆయన వరుస సమావేశాలకు హాజరవుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరువుతున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన జీవన్ రెడ్డిని పార్టీ లో చేర్చుకోనున్నారు. ఈ సందర్భంగానే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను తాజాగా మాజీ మంత్రులు కేసీఆర్, హరీష్‌రావులు పరిశీలించారు.
ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక నుంచి కేసీఆర్ ప్రజల్లోనే ఉండనున్నారని.. ప్రభుత్వ అవినీతిని.. ముఖ్యమంత్రి నిద్రమత్తును కూడా వదిలిస్తారని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్రజల సమస్యలపైనా కేసీఆర్ స్పందిస్తారన్నారు. కేసీఆర్ జగిత్యాలకు వస్తుంటే.. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి .. ఉద్దేశ పూర్వకంగా మేడిగడ్డకు పోతున్నారని వ్యాఖ్యానించారు. అక్కడేదో జరిగిపోయినట్టుగా ఆయన ప్రజలకు వివరిస్తానని చెబుతున్నారని విమర్శించారు. ఇక, తమ సభ పెట్టుకున్న రోజునే ఇక్కడ రహదారుల నిర్మాణం చేపట్టడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని దుయ్యబట్టారు.
కేసీఆర్ సెంటిమెంటు పారేనా?
కేసీఆర్ అంటేనే తెలంగాణ ప్రజలకు పెద్ద సెంటిమెంటు. గత 2023 ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ.. ఆయన సెంటిమెంటు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించడం..వరుసగా సభలు నిర్వహించాలని నిర్ణయించడం వెనుక ఆ సెంటిమెంటును రాజేయాలని చూస్తున్నారు. కానీ, మరోవైపు.. ఆయన కుమార్తె కవిత.. పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. పది సంవత్సరాలు ప్రజలను విస్మరించారు కాబట్టే.. ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారని..ఆమె కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించినా.. అది కేసీఆర్‌కు కూడా తగులుతోంది.
అయితే.. కేసీఆర్ ప్రజల మధ్యకు రావడం ప్రారంభమైతే.. తమకు తిరుగు ఉండదని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. గత 2023 ఎన్నికల తర్వాత.. అటు అసెంబ్లీకి.. ఇటు ప్రజల మధ్యకు కూడా కేసీఆర్ రావడం మానేశారు. అనారోగ్య సమస్యలతో తొలి ఏడాది.. ఆయన ఫాం హౌస్‌కే పరిమితం అయ్యారు. దాదాపు రెండేళ్లకుపైగానే ఇంటికే పరిమితం అయిన కేసీఆర్ .. ఇప్పుడు ప్రజల మధ్యకు రావడం తమకు కలిసి వస్తుందని బీఆర్ ఎస్ అంచనా వేస్తుండగా.. కేసీఆర్ పదేళ్ల పాలన ప్రజలు ఇంకా మరిచిపోలేదని.. కాంగ్రెస్ చెబుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates