బడ్జెట్‌తో సంబంధం లేకుండానే ఇన్ని హామీలా?

ఎన్నిక‌లు అన‌గానే పార్టీలు ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నించ‌డం కామ‌నే. అయితే.. ఒక‌ప్పుడు అంటే.. ప‌ది ప‌దిహేనేళ్ల కింద‌టి వ‌ర‌కు రాష్ట్రాల ఆర్థిక స్థితిగ‌తుల‌ను దృష్టిలో పెట్టుకుని నాయ‌కులు హామీలు గుప్పించేవారు. త‌ద్వారా.. ప‌రిమితంగానే ఉచితాల బాట ప‌ట్టేవారు. కానీ, త‌మిళ‌నాడు వంటి కీల‌క రాష్ట్రాల్లో ఈ ప‌రిమితి దాదాపు 40 ఏళ్లుగా క‌నిపించ‌డం లేదు. రాష్ట్రాల బ‌డ్జ‌ట్‌తో సంబంధం లేదు. కేవ‌లం ఓట‌ర్ల‌ను ఆ క్ష‌ణంలో మ‌చ్చిక చేసుకునే దిశ‌గానే పార్టీలు అడుగులు వేస్తున్నాయి.

ఎన్నిక‌లు ఏవైనా కూడా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనే క్ర‌తువులో భాగంగా.. భారీ ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. ఒక‌రికి మించి మ‌రొక‌రు.. రాష్ట్రంలో హామీల వ‌ర‌ద పారిస్తున్నారు. తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లోనూ ఇదే ప‌రంపర కొన‌సాగుతోంది. వాస్త‌వానికి 2021లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో డీఎంకే ఇలానే భారీ హామీలు గుప్పించింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని.. అప్ప‌ట్లో స్టాలిన్ ప్ర‌క‌టించారు. కానీ, అధికారంలోకి వ‌చ్చిన ఐదేళ్ల‌లో ఇచ్చిన ఉద్యోగాలు కేవ‌లం 50 వేల లోపే ఉన్నాయి.

త‌ద్వారా ఓట‌ర్ల క‌ళ్ల‌కు గంత‌లు ఎలా క‌ట్టారో అర్థ‌మ‌వుతుంది. ఇదొక్క‌టే కాదు.. 2021 ఎన్నిక‌ల్లో స్టాలిన్ ఇచ్చిన మ‌రోహామీ.. నిరుద్యోగుల‌కు పెద్ద‌పీట వేయ‌డం. ప్ర‌తి ఒక్క‌రికీ ఉద్యోగం వ‌చ్చే వ‌రుకు రూ.2000 ఇస్తామ‌న్నారు. ఇది కూడా సాకారం కాలేదు. రైతుల‌కు ఇన్‌పుట్ స‌బ్జిడీ ఇస్తామ‌న్నారు. దీనిపైనా చేతులు ఎత్తేశారు. ఇలా.. గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌నే అమ‌లు చేయ‌లేక పోయారు. కానీ, ఇప్పుడు మ‌రోసారి హామీల వ‌ర‌ద పారుతోంది.

తాజాగా స్టాలిన్‌తో పోటీ ప‌డుతున్న‌ట్టు విజ‌య్ పార్టీ త‌మిళ వెట్రిక‌ళ‌గం సైతం హామీల‌పై హామీలు ఇస్తోంది. 18-60 ఏళ్ల మ‌హిళ‌ల‌కు 2500 చొప్పున నెల వారి భృతి ఇస్తామ‌ని.. ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1.12 కోట్ల మంది మ‌హిళ‌లు ఉంటే.. వీరిలో 80 ల‌క్ష‌ల మంది పైచిలుకు 18-60 ఏళ్ల‌లోపు ఉన్నారు. వీరంద‌రికీ నెల‌కు రూ.2500 ఇవ్వ‌డం సాధ్య‌మేనా? ఇక‌, నిరుద్యోగుల‌కు నెల‌కు 4 వేలు ఇస్తామ‌న్నారు. ఇది కూడా సాకారం కాని హామీగానే మిగిలిపోనుంద‌ని అంటున్నారు.

అస‌లు బ‌డ్జెట్ ఎంత‌?

త‌మిళ‌నాడు ప‌రంగా చూసుకుంటే.. రాష్ట్ర బ‌డ్జెట్.. 2025-26లో 4,39,293 కోట్ల రూపాయ‌లు. దీనిలో రెవెన్యూ వ్య‌యం.. అంటే ఉద్యోగుల‌కు జీతాలు.. పింఛ‌న్లు వంటివే 3,32,325 కోట్ల రూపాయ‌ల ఉంది. ఇక‌, ప్ర‌బుత్వానికి మిగిలేది.. కేవ‌లం ల‌క్ష కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే. పైగా.. రాష్ట్రంలో రెవెన్యూ లోటు 1.2 శాతం ఉంది. అంటే.. ఖ‌ర్చుకు, ఆదాయానికి మ‌ధ్య లోటు.. 41 వేల కోట్ల రూపాయ‌లు ఉంది.

అదేస‌య‌మంలో ద్ర‌వ్య లోటు 3 శాతం ఉంది. అప్పులు.. దాదాపు 10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు చేరాయి. వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. ఇప్పుడు ఇస్తున్న హామీలు ఏమేర‌కు స‌క్సెస్ అవుతాయ‌న్న‌ది ప్ర‌శ్న‌. ఏదేమైనా ఎన్నిక‌ల రాజ‌కీయంలో హామీల వ‌ర‌ద‌కు అడ్డు లేకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ నెల 23న 234 అసెంబ్లీ స్థానాల‌కు ఒకే విడ‌త‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది.