లోక్ సభలో ఈ రోజు ప్రవేశ పెట్టే డీలిమిటేషన్ బిల్లు..మహిళా బిల్లు.. దీనికి తగ్గట్లుగా రాజ్యాంగ సవరణ బిల్లు మొత్తంగా ఒక్క అంశం మీదనే అందరి ఫోకస్ ఉంది. అది..నియోజకవర్గాల పునర్వభిజన బిల్లుతో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందా? మేలు జరుగుతుందా? అని. అయితే.. బిల్లులో కీలక అంశమైన.. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి అనుసరించే మార్గంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇందుకు భిన్నంగా ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా.. నలుగురు కేంద్ర మంత్రులతో నేరుగా ఇదే అంశంపై మాట్లాడటం.. జనాభా ప్రాతిపదికన కాదు.. రాష్ట్రాల వారీగా ఇప్పటికే ఉన్న స్థానాలకు గుండుగుత్తుగా యాభై శాతం పెంపుపై స్పష్టత రావటంతో ఆసక్తికర చర్చ మొదలైంది.
2014లో ఉమ్మడిగా ఉన్న ఏపీ.. రెండు రాష్ట్రాలుగా విడిపోవటం తెలిసిందే. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల్ని పెంచుతామని విభజన చట్టంలో స్పష్టం చేశారు. తాజాగా తెరమీదకు వచ్చిన నియోజకవర్గాల పునర్వభిజన చట్టం కారణంగా తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందా? విభజన చట్టాన్ని యథాతధంగా అమలు చేస్తే లాభం జరుగుతుందా? అన్నది సందేహంగా మారింది. అయితే.. నియోజకవర్గాల పెంపు యాభై శాతం గుండుగుత్తుగా అని స్పష్టత వచ్చేసిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ.. లోక్ సభ స్థానాలకు సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చేసిందని చెప్పాలి.
ఉమ్మడి రాష్ట్రంలో..
ఉమ్మడి ఏపీలో 2014 వరకు 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 42 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 175 స్థానాలు.. తెలంగాణకు 119 స్థానాలు వెళ్లాయి. అదే సమయంలో లోక్ సభ స్థానాల అంశాన్నే తీసుకుంటే.. ఏపీకి 25 స్థానాలు.. తెలంగాణకు 17 స్థానాలు కేటాయించటం తెలిసిందే. విభజన చట్టంలో పేర్కొన్న హామీ ప్రకారం లోక్ సభ స్థానాల్ని పక్కన పెట్టి.. అసెంబ్లీ స్థానాల్ని చూస్తే.. లెక్కలో క్లారిటీ వస్తుంది. అదే సమయంలో.. ఏ విధానాన్ని అమలు చేస్తే మేలు జరుగుుతుందన్న దానిపైనా స్పష్టం పక్కాగా వస్తుంది.
విభజన చట్టం ప్రకారం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో..
విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచుతామని సెలవిచ్చారు. ఈ లెక్కన ఏపీ అసెంబ్లీలో ఉన్న 175 స్థానాలకు 225 స్థానాలు పెరగాలి. అదే ఇప్పుడు కేంద్రం తెర మీదకు తీసుకొచ్చిన పునర్విభజన చట్టంలో చెప్పినట్లుగా 50 శాతం గుండుగుత్తగా స్థానాల్ని పెంచేస్తే ఏపీలో అసెంబ్లీ స్థానాలు 263కు చేరుకుంటాయి.
అంటే.. విభజన చట్టంలో పేర్కొన్న దాని కంటే తాజా డీలిమిటేషన్ బిల్లుతోనే ఎక్కువగా అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. అదే సమయంలో తెలంగాణ విషయానికి వస్తే.. ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 50 శాతం పెంపుతో ఇది కాస్తా 179కు పెరుగుతంది.
జనాభా లెక్కలు వర్సెస్ 50 శాతం గుండు గుత్తు
లోక్ సభ స్థానాల్ని జనాభా ప్రాతిపదికన తీసుకుంటారన్న వాదనలు తొలుత రావటం తెలిసిందే. ఈ అంశంపై ఏపీ సీఎం కేంద్రమంత్రులతో నేరుగా ఫోన్ మాట్లాడి 50 శాతం గుండుగుత్తగా పెంచుతారని స్పష్టంగా తెలుసుకున్న వేళలో.. గుండు దేంతో ఎంత లాభమన్న విషయాన్ని గణాంకాల్ని పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఏపీ రాష్ట్ర వాటా 4.08 శాతం. ఆ నిష్ఫత్తి ప్రకారం ఏపీకి వచ్చే లోక్ సభ స్థానాలు 33 మాత్రమే. ఇది ఉత్తరాదితో పోలిస్తే ఏపీకి నష్టం. అదే సమయంలో జనాభా లెక్కల ప్రకారం కాకుండా.. గుండుగుత్తుగా 50 శాతం సీట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకుంటే.. ఏపీలో లోక్ సభ సీట్లు ప్రస్తుతం ఉన్న 25 సీట్లు కాస్తా 37-38 అవుతాయి.
తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుతం లోక్ సభ స్థానాలు 17 ఉన్నాయి. జనాభా లెక్కలు కాకుండా.. 50 శాతం గుండుగుత్తుగా పెంచేస్తే తెలంగాణలో లోక్ సభ స్థానాల సంఖ్య 17 కాస్తా 25-26 మధ్యలో పెరిగే వీలుంది. మొత్తంగా చూస్తే.. విభజన చట్టాన్ని అనుసరించే కన్నా.. తాజాగా సభలో ప్రవేశ పెడుతున్న50 శాతం గుండుగుత్తుగా పెంచే బిల్లుతోనే తెలుగురాష్ట్రాలకు మేలు చేకూరుస్తుందని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
