అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు. తాజాగా ఆ తీరును మరోసారి అందరికి అనుభవంలోకి వచ్చేస్తున్న పరిస్జితి. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా రెండు కీలక అంశాల్ని తెలివిగా ఒకదాన్లోకి మరొకటి తీసుకొచ్చేయటం ద్వారా.. డబుల్ బెనిఫిట్ పొందాలన్న మాస్టర్ స్కెచ్ వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దశాబ్దాల పర్యంతం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న మాటలు చెబుతున్నా.. చేతల్లో మాత్రం కుదరని పరిస్థితి. తిరుగులేని పవర్ చేతిలో ఉన్నప్పుడు హస్తం పార్టీ అధినేత సోనియా సైతం ప్రయత్నించినా.. కుదర్లేదు. చివర్లో ఈ అంశంపై వెనక్కి తగ్గాల్సిందే.
ఇక్కడే సోనియమ్మకు మాస్టర్ మైండ్ మోడీకి మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. ఒక ఇష్యూను తెర మీదకు తీసుకొచ్చి.. మరో పెద్ద ఇష్యూను దానితో కలిపేసి.. తాను అనుకున్న పనిని అనుకున్నట్లు పూర్తి చేసే వ్యూహం మోడీషాలలో కనిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి గేమ్ ప్లాన్ ను సిద్ధం చేశారు. నిజానికి సంబంధం లేనట్లుగా కనిపించే రెండు అంశాల్ని ఇట్టే కలిపేసిన తీరు చూస్తే ముచ్చటేస్తుంది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలు డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. దానిని ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.
అందరూ మహిళలకు గౌరవం ఇవ్వాలని చెబుతూనే.. వారి చేతికి అధికారం ఇచ్చేందుకు మాత్రం మగమహారాజులు ససేమిరా అనే పరిస్థితి. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు వీలుగా నియోజకవర్గాల్ని పెంచే పెద్ద ప్లాన్ వేశారు. ఇలా చేసినప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు (చట్టసభల్లో).. మరో వైపు నియోజకవర్గాల పునర్విభజన పూర్తి అవుతుంది. ఇప్పుడున్న లోక్ సభ స్థానాల గరిష్ఠ సంఖ్య 550 నుంచి 850కు పెంచేయటం ద్వారా.. ఓవైపు మహిళా రిజర్వేషన్లు.. మరోవైపు లోక్ సభ స్థానాల పునర్విభజన పూర్తి అవుతుంది.
నిజానికి ఈ రెండు అంశాలు వేటికవే భారీ చర్చకు దారి తీసేవి. మోడీషా చాణక్యంతో ఇప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల మీద కంటే కూడా నియోజకవర్గాల పునర్విభజన మీదే అందరి ఫోకస్ ఉంది. తాజాగా ఎంపీలకు అందించిన బిల్లు ప్రతిలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఏ తీరును అనుసరిస్తారన్న అంశాన్ని ప్రస్తావించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్న మోడీ సర్కారు.. అత్యంత కీలకమైన మహిళా రిజర్వేషన్ల అంశంపై ఇప్పుడు ఎవరి ఫోకస్ లేకుండా చేయటంలో సక్సెస్ అయ్యారు.
ప్రస్తుతం లోక్ సభలోనూ.. అటు రాజ్యసభలోనూ ఎన్డీయే కూటమికి ఉన్న బలం నేపథ్యంలో తాము అనుకున్నట్లుగా బిల్లులను చట్టంగా మార్చేయటం చాలా సులువు. కాకుంటే.. నియోజకవర్గాల పునర్విభజన అంశమే ఇప్పుడు పలు రాష్ట్రాలకు టెన్షన్ గా మారింది. ఒకవేళ.. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు అయితే మాత్రం.. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు శాపంగా మారుతుంది. అలా కాకుండా అమిత్ షా అనధికారికంగా పేర్కొన్నట్లు.. జనాభాతో సంబంధం లేకుండా యాభై శాతం స్థానాల్ని పెంచటాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే మాత్రం.. కొంత రచ్చ జరిగినప్పటికీ.. రెండు కీలక బిల్లులు సక్సెస్ ఫుల్ గా చట్టాలు కావటం ఖాయం.
ఈ రెండు బిల్లుల్ని చట్టాలుగా మార్చటం వల్ల కలిగే ప్రయోజనం చూస్తే.. దశాబ్దాల తరబడి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను చట్టంగా మార్చిన ఘనత మోడీ సర్కారుకు లభిస్తుంది. ఆ పార్టీకి మహిళల నుంచి అంతో ఇంతో సానుకూలత లభించే వీలుంది.
అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి అయితే.. మరో పెద్ద తేనెతుట్టెను కదలించినప్పటికి తెలివిగా ఎస్కేప్ అయ్యే పరిస్థితి. నిజానికి ఈ రెండు బిల్లులు దేనికదే.. చిక్కుముడలతో కూడినవి. కానీ.. ఈ రెండింటిని ఒకేసారి తెర మీదకు తీసుకురావటం ద్వారా మోడీషాలు మహా తెలివిని ప్రదర్శించారని మాత్రం చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
