ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రి. నిరంతరం రాజకీయ సంఘర్షణలకు ఈ నియోజకవర్గం వేదికగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఏ చిన్న తేడా వచ్చినా.. అది రాజకీయ వేడిని రాజేస్తోంది. ముఖ్యంగా వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య అగ్గిమీద గుగ్గిలంలాగా ఇక్కడ రాజకీయాలు కొనసాగుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది.
ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా రాజకీయ అలజడి నెలకొన్న తాడిపత్రిలో.. ఇటీవల 15 రోజులుగా మాత్రమే ఒకింత ప్రశాంతంగా ఉంది. పోనీలే.. ఇక నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం ఏర్పడిందని అందరూ అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా మరో భారీ సంఘటన చోటు చేసుకుంది. జేసీ కుటుంబానికి చెందిన చింత చెట్లకు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో సుమారు 30 ఎకరాల్లోని చింతచెట్లు తగలబడి బూడిదయ్యాయి.
ఈ పరిణామంతో మరోసారి రాజకీయ కలకలం రేగింది. తాడిపత్రి నియోజకవర్గం పరిధిలోని జూటూరులో జేసీ 60 ఎకరాల్లో చింత మొక్కలను పెంచుతున్నారు. అయితే.. గుర్తుతెలియని దుండగులు చింత తోటకు నిప్పు పెట్టడంతో చెట్లన్నీ బూడిదయ్యాయి. ఈ పరిణామం వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని జేసీ వర్గం ఆరోపించింది. తమను వేధించేందుకే ఇలా చేస్తున్నారని పేర్కొనడం గమనార్హం. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు.. జేసీ ఉద్దేశ పూర్వకంగానేఇలా చేస్తున్నారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆరోపించారు. చింత చేను ఎండిపోయిందని.. దీంతో ఎలానూ నష్టం వచ్చింది కాబట్టి.. దానికి నిప్పు పెట్టుకున్నారని.. పైగా దీనిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నంలో ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.
ఇరు వర్గాల మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైంది. దీంతో తాడిపత్రిలో యాక్ట్ 30తో పాటు కీలక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించేందుకు పోలీసులు పరిశీలిస్తున్నారు. మరి ఈ వివాదం ఎటుదారితీస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
