తన రాజకీయ ప్రత్యర్థి వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పార్లమెంట్లో కీలక బిల్లుకు మద్దతు పలకాలని ఆయన కోరారు. జగన్ కు లేఖ రాయడంతో పాటు మిగతా పార్టీల అధ్యక్షులకు చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. జనసేన అధ్యక్షులు కె పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస రావుకు ముఖ్యమంత్రి లేఖలు పంపారు.
ఏప్రిల్ 16న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లు భారత ప్రజాస్వామ్య చరిత్రలో చారిత్రాత్మక ఘట్టమని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళల రాజకీయ సాధికారతకు ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి మద్దతు తెలుపుతూ, చట్టసభల్లో మహిళలకు మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించే దిశగా అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలని కోరారు.
మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని, ప్రభుత్వ వ్యవస్థల్లో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో స్పష్టం చేశారు. విద్య, వైద్యం, పరిశోధనలు, సాంకేతికత, క్రీడలు, రక్షణ, వాణిజ్య రంగాల్లో మహిళలు చూపుతున్న ప్రతిభ దేశానికి గర్వకారణమన్నారు.
మహిళా రిజర్వేషన్ అంశంపై దశాబ్దాలుగా జరుగుతున్న చర్చలకు ఈ బిల్లు ముగింపు పలుకుతుందని, 2023లో ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలకడం ప్రజాస్వామ్య పరిపక్వతకు నిదర్శనమని తెలిపారు. 2029 ఎన్నికల నుంచే అమలు చేయాలన్న కేంద్ర ఆలోచనను సమిష్టిగా బలపరచాలని పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
