ఓట్ల తొల‌గింపు ఎఫెక్ట్ ఉంటే ఎన్నిక‌లు రద్దేనా?

ఓట్ల తొల‌గింపు అంశంపై సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇలా ఓట్లు కోల్పోయిన వారి వ‌ల్ల ఎన్నిక‌లు ప్ర‌భావితం (ఎఫెక్ట్‌) అవుతాయ‌న్న భావ‌న ఉంటేనే స‌ద‌రు ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. అలా కాకుండా.. ఉంటే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ జోలికి న్యాయ వ్య‌వ‌స్థ వెళ్ల‌బోద‌ని పేర్కొంది. ఓట‌ర్లుగా ఉన్న‌వారికి త‌మ హ‌క్కును వినియోగించుకోవ‌డం స‌రైన చ‌ర్యేన‌ని .. అయితే.. లోటుపాట్ల‌ను నిర్ణ‌యించేది కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మేన‌ని.. సుప్రీంకోర్టు ఎవ‌రికీ నేరుగా ఓటు హక్కు క‌ల్పించే బాధ్య‌త‌ను తీసుకోద‌ని వ్యాఖ్యానించింది.

ఏం జ‌రిగింది?

ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప‌శ్చిమ బెంగాల్‌లో 90 ల‌క్ష‌ల మందికిపైగా ఓట‌ర్ల‌ను జాబితాల నుంచి తొల‌గించారు. వీరిలో డ‌బుల్ ఎంట్రీ, ఒకే అడ్ర‌స్‌, ముఖ గుర్తింపు స‌రిగా లేక‌పోవ‌డం వంటి కార‌ణాలు ఉన్నాయ‌ని.. ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. గ‌త రెండు మాసాల కాలంలో ప‌శ్చిమ బెంగాల్‌లో చేప‌ట్టిన `స‌ర్` ప్ర‌క్రియ‌లో ఇలా ఓట్లు తొల‌గించ‌డం.. అటు రాజ‌కీయంగాను.. ఇటు ఎన్నిక‌ల సంఘం ప‌రంగా కూడా తీవ్ర వివాదానికి దారితీసింది. మ‌రో వైపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు ఈ నెల 23, 29 తేదీల్లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో వేలాది మంది ఓట్లు కోల్పోయిన వారు గ్రూపులుగా ఏర్ప‌డి సుప్రీంకోర్టులో పిటిష‌న్లు వేశారు.

ఈ నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో వాటిని విచారించి.. త‌గు చ‌ర్య‌లు తీసుకునేలా రాష్ట్రంలోని స్థానిక కోర్టుల‌కు సుప్రీంకోర్టు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అయితే.. ఇన్ని ల‌క్ష‌ల పిటిష‌న్ల‌ను విచారించేందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన ట్రైబ్యునళ్ల‌కు స‌మ‌యం స‌రిపోవ‌డం లేదు. దీంతో మ‌రోసారి వీరంతా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. స‌ర్ ప్ర‌క్రియ త‌ప్పుల త‌డ‌క‌గా సాగింద‌ని.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌ను వాయిదావేయాల‌ని ఆదేశించాల‌ని కోరారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని కోర‌డానికి.. లేదా ర‌ద్దు చేయాల‌ని కోర‌డానికి కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయ‌ని గుర్తు చేసింది.

భారీ స్థాయిలో ఎన్నిక‌లు ప్ర‌భావితం అవుతాయ‌ని భావించిన‌ప్పుడు మాత్ర‌మే.. స‌ద‌రు ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ఆదేశించ‌గల‌మ‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్ర‌స్తుతం ప‌శ్చిమ‌బెంగాల్‌లో నెల‌కొన్న ప‌రిస్థితి త‌మ‌కు కూడా ఆందోళ‌న క‌లిగిస్తూనే ఉంద‌ని , కానీ.. ఎన్నిక‌లు ప్ర‌భావ వంత‌మ‌య్యేలా ప్ర‌స్తుత ప‌రిస్థితి ఉంద‌ని ఎవ‌రూ నిరూపించ‌లేకపోతున్నార‌ని వ్యాఖ్యానించింది. పైగా.. ట్రైబ్యున‌ళ్లు కూడా రేయింబ‌వ‌ళ్లు ప‌నిచేస్తున్నాయ‌ని.. అర్హులైన ఓట‌ర్ల‌కు న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని తెలిపింది. ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రూ ఓటు హ‌క్కు కోల్పోరాద‌ని.. ఇదేస‌మ‌యంలో నిబంధ‌న‌ల మేర‌కు వ్య‌వ‌హ‌రించాల్సిందేన‌ని తేల్చి చెప్పింది.