‘త‌ల్లిని కోర్టుకు ఈడ్చిన కొడుకు మ‌న‌కు అవ‌స‌ర‌మా?’

రాష్ట్ర‌ విభ‌జ‌న కంటే కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్‌తోనే రాష్ట్రానికి ఎక్కువ‌గా న‌ష్ట‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వైసీపీ సాగించిన ఐదేళ్ల పాల‌న‌లో రాష్ట్రంలో అడుగ‌డుగునా విధ్వంసం చోటు చేసుకుంద‌న్నారు. ఇప్పుడు తాము ఆ విధ్వంసాన్ని స‌రిదిద్దుతున్నామ‌న్నారు. విధ్వంసాల నుంచి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న‌ట్టు చెప్పారు. బాప‌ట్ల‌జిల్లా వేమూరులో ప‌ర్య‌టించిన సీఎం చంద్ర‌బాబు.. మీ భూమి-మీహ‌క్కు కార్య‌క్ర‌మంలో భాగంగా రైతుల‌కు ప‌ట్టాదారు పాసు పుస్త‌కాలు పంపిణీ చేశారు.

అనంత‌రం.. చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ఏపీలో సుప‌రిపాల‌న అందిస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చామ‌ని.. దానిని నిల‌బెట్టుకుంటున్నామ‌ని చెప్పారు. గ‌డిచిన 22 మాసాల్లో 20 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చామ‌న్నారు. ఇప్ప‌టికి 6 ల‌క్ష‌ల మందికి పైగా యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించామ‌ని.. రానున్న రోజుల్లో మొత్తం 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌న‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను తూ.చ. త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్నామ‌న్నారు.

వాటితోపాటు చెప్ప‌ని కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌ను కూడా అనేకం అమ‌లు చేస్తున్నామ‌ని సీఎం తెలిపారు. “ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమానికి తిరుగులేదు.. అభివృద్ధి కి తిరుగులేదు“ అని వ్యాఖ్యానించారు. సూప‌ర్ సిక్స్ హామీల‌ను స‌మ‌గ్రంగా అమ‌లు చేశామ‌న్నారు. అన్ని శాఖ‌ల్లోనూ సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌స్తున్నామ‌న్నారు. “ఒక వ్య‌క్తి చేసిన విధ్వంసాన్ని స‌రిదిద్దేందుకు నాకు చాలా స‌మ‌యం ప‌డుతోంది.“ అని జ‌గ‌న్‌నుఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా భూముల‌కు సంబంధించి జ‌గ‌న్ చేసిన ప‌నుల కార‌ణంగా రెవెన్యూ వ్య‌వ‌స్థ పూర్తిగా దెబ్బ‌తిందన్నారు. దీనిని స‌రిచేసేందుకు తాను ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ధ పెట్టాల్సి వ‌చ్చింద‌న్నారు. ప‌ట్టాదారు పాసుపుస్త‌కాల పేరుతో సొంత వారికి భూములు క‌ట్ట‌బెట్టే ప‌నిని చేప‌ట్టార‌న్నారు. దీనిని స‌రిచేసి.. న్యాయ‌బ‌ద్ధ‌మైన హ‌క్కు దారుల‌కు ఇప్పుడు ప‌ట్టాలు ఇస్తున్నామ‌న్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి నెలా 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప‌ట్టాలు పంపిణీ చేసేకార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామ‌న్నారు.

“త‌ల్లిని కోర్టుకు ఈడ్చిన కొడుకు మ‌న‌కు స‌మ‌స్య కాకూడ‌దు..“ అని ప‌రోక్షంగా జ‌గ‌న్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాంటి కొడుకు స‌మ‌స్య కాకూడ‌దనుకుంటే.. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. అలాంటి కొడుకుమ‌న‌కు అవ‌స‌ర‌మా? అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఉంటేనే అభివృద్ధి సాకారం అవుతుంద‌న్నారు.