మండలి ఛైర్మన్ పై చేయి చేసుకున్న మంత్రి అతనేనా?

ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి కోసం పోరాడిన అంశాల్ని.. రాజధానిగా అమరావతిని వ్యతిరేకించిన అప్పటి వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించిన చర్చ మరోసారి మొదలైంది. అన్నింటికి మించి అమరావతిని శాశ్విత రాజధానిగా ఆమోదం లభించిన నేపథ్యంలో ఏపీ శాసన మండలి ఛైర్మన్ గా వ్యవహరించిన మహమ్మద్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ సంచలన అంశాల్ని వెల్లడించారు.

నాటి జగన్ ప్రభుత్వం మూడు రాజధానులకు అనుకూలంగా ఒక బిల్లును ఏపీ అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత శాసన మండలి ఆమోదానికి తీసుకొచ్చారు. అయితే.. మూడు రాజధానుల బిల్లుకు ఆయన ససేమిరా అనటం..అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవటానికి ఆయన ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా నాటి మంత్రులు.. వైసీపీ నేతలు పలువురు ఆయనపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అయినప్పటికి మండలి ఛైర్మన్ మాత్రం నో అంటే నో అన్న పరిస్థితి. ఈ సందర్భంగాఆయన చుట్టుమూగి ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా తన గుండెలపై ఓ మంత్రి చేయి వేసి కొట్టారంటూ నాటి దురద్రష్టకర పరిణామాల్ని గుర్తు చేసుకున్నారు. దీంతో.. ఆయనపై చేయి వేసిన మంత్రి ఎవరు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రముఖ మీడియా సంస్థలు.. టీవీ చానళ్లు ఈ దారుణ సంఘటన వివరాల్ని కవర్ చేయటం కనిపిస్తుంది. అంతేకాదు.. ఇంగ్లిషు దినపత్రికలు సైతం ఈ అంశాన్ని భారీగా హైలెట్ చేయటం.. జాతీయ స్థాయిలో ఈ అంశంపై చర్చ జరిగింది.

ఇంతకూ నాటి మండలి మాజీ ఛైర్మన్ గుండెలపై చేయి వేసిందెవరు? అన్న వివరాల్లోకి వెళితే.. అప్పట్లో పలు తెలుగు.. ఇంగ్లిషు మీడియా సంస్థలు నాటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. మరో మంత్రికొడాలి నానిలు మండలిఛైర్మన్ వైపు దూసుకెళ్లటం.. మైకులు విరగొట్టటం..మండలి ఛైర్మన్ షరీఫ్ ను తెగ ఇబ్బందికి గురి చేశారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై అప్పట్లో టీడీపీ తీవ్రంగా మండిపడింది. ఒక ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై దాడికి ప్రయత్నిస్తారా? ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అంటూ చేసిన వ్యాఖ్య అప్పట్లో పెను దుమారం రేపింది. తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవాల్ని గుర్తు చేసుకుంటే.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి.