అలా చెప్పుకోవడం కరెక్టేనా సీఎం గారు?

కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ ధైర్యం వేరే లెవల్ అన్న భావన కలుగక మానదు. కేరళలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా గ్యారెంటీలను ప్రకటించింది. వీటి అమలుపై అక్కడి రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావించిన సీఎం రేవంత్.. తమ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామంటూ చెప్పటమే కాదు.. కావాలంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూడాలని కోరటం ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే.. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ఎన్నికల ప్రధాన హామీలుగా చెప్పటమే కాదు.. వీటి అమలుకు సంబంధించిన క్యాలెండర్ ను కూడా ప్రకటించటం తెలిసిందే. అయితే.. ప్రభుత్వం కొలువు తీరి మూడేళ్లు దగ్గరకు వస్తున్నప్పటికి.. ఇప్పటికి కొన్ని గ్యారెంటీలను మాత్రమే అమలు చేస్తున్నారే తప్పించి.. పూర్తిస్థాయిలో గ్యారెంటీలను అమలు చేస్తున్నది లేదు. కానీ.. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా.. తిరుగులేని ఆత్మవిశ్వాసంతో పుసుక్కున చెప్పేసిన సీఎం రేవంత్ మాటల్ని చూస్తే.. ఔరా అని అనుకోకుండా ఉండలేని పరిస్థితి.

ఓ మాటగా చెబితే సరిపోయే దానికి.. తెలంగాణ రాష్ట్రంలో ఆరు హామీల్నిఅమలు చేశామా? చేయలేదా? కొన్నే అమలు చేశాం కదా? ఎన్నికల వేళ చెప్పిన అన్ని అమలు చేయలేదన్న విషయాన్ని ప్రస్తావించకుండా అంతా ఆల్ రైట్.. ఆల్ రైట్ అన్నట్లుగా చెప్పిన మాటల్ని చూస్తే.. ఏ ధైర్యంతో అంతలా చెప్పారన్న భావన కలుగక మానదు.

కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అమలవుతున్న పథకాలను ప్రత్యక్షంగా చూసి.. తమ ట్రాక్ రికార్డును పరిశీలించి.. చూడొచ్చన్న సవాలును కూడా విసరటం విశేషం. ఇక్కడే.. మనం రేవంత్ మాటల్లో నిజం ఎంత? అన్న లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది. సీఎం స్థాయిలో ఉండి.. వేరే రాష్ట్రానికి వెళ్లి.. పూర్తిస్థాయిలో అమలు చేయని వాటిని అమలు చేస్తున్నట్లుగా ఎలా చెప్పుకుంటారన్నది ప్రశ్న.

2023 సెప్టెంబరు 17న హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభలో సోనియా గాంధీ తాము అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. ఇందులో..

మహాలక్ష్మి పథకం

మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం

రూ.500లకే గ్యాస్ సిలిండర్ సరఫరా

రాష్ట్ర వ్యాప్తంగా టీజీఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

రైతుభరోసా

రైతులు.. కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి ₹15,000 పెట్టుబడి సాయం.

వ్యవసాయ కూలీలకు ఏడాదికి ₹12,000 ఆర్థిక సాయం.

వరి పంటకు క్వింటాల్‌కు ₹500 బోనస్.

గృహ జ్యోతి

ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

ఇందిరమ్మ ఇండ్లు

ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలం.. ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం.

తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం

యువ వికాసం

విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం రూ.5 లక్షల విలువైన ‘విద్యా భరోసా’ కార్డు.

ప్రతి మండలంలో ‘తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్’ ఏర్పాటు.

చేయూత

వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు మరియు ఇతరులకు నెలకు రూ.4 వేల పెన్షన్

రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం.

ఎన్నికలు ముగిసి.. రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటై ఎంతకాలం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు అయ్యాయి? ఎన్ని కాలేదు? లాంటి అంశాలపై ఫోకస్ చాలా అవసరం.

కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్లి.. తాము ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తున్న టోన్ లో చెప్పటమే అభ్యంతరకరం. ఇలాంటి తీరు.. ముఖ్యమంత్రి మీద ఉండే నమ్మకాన్ని.. విశ్వాసాన్ని పలుచన చేసేలా ఉంటుందన్నది మర్చిపోకూడదు. కేరళలో చేసిన ఎన్నికల ప్రచారం మీద రానున్న రోజుల్లో విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేపటి విమర్శ ఏమో కానీ.. ఇవాల్టి రోజును మాత్రం ఘనంగా చెప్పుకోవటం మాత్రం సీఎం రేవంత్ కే చెల్లుతుందని చెప్పాలి.