ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్ కు భారీగా డ్యామేజ్ అయ్యింది. ఆయనకు అమెరికన్ల మద్దతు నానాటికి తగ్గిపోవటమే కాదు.. ఇప్పుడు మైనస్ లోకి వెళ్లిపోయిన వైనం ఆసక్తికరంగా మారింది. ఈ మధ్యన ఇరాన్ తో మొదలుపెట్టిన యుద్ధం ఆయనకు మరింత ఇబ్బందికి గురి చేస్తోంది.

ఇటీవల కాలంలో నిర్వహించిన పలు సర్వేలు ఆయన ఇమేజ్ ఎంతగా పడిపోయిందన్న విషయాన్ని.. ఆయనకు ప్రజామోదం ఏ మాత్రం లేదన్న విషయాన్ని స్పష్టం చేసే గణాంకాలు నమోదవుతున్నాయి. ఆయన పని తీరుపై అత్యధికులు తీవ్రమైన అసంత్రప్తితో ఉండటమేకాదు.. ఆయనకు రేటింగ్ ఇచ్చే విషయంలో నెగిటవ్ లోకి వెళ్లిపోతోంది.

ఏఎఫ్ పోస్ట్ సంస్థ తాజాగా ఎక్స్ లో పోస్టు చేసిన వీడియో పోస్టులో ట్రంప్ ప్రజామోదం రేటింగ్ ఏకంగా మైనస్ 17కు పడిపోయిన విషయాన్ని వెల్లడించింది. ఆయన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే అత్యల్ప రేటింగ్ గా చెబుతున్నారు. అంతేకాదు.. అమెరికా చరిత్రలో మరే అధ్యక్షుడికి దక్కని దారుణమైన క్రెడిట్ ను ఆయన సొంతం చేసుకున్నారు.

ఇప్పటివరకు పదవిలో ఉన్న ఏ అమెరికా అధ్యక్షుడికి ఇంత తక్కువ రేటింగ్ దక్కలేదని చెబుతున్నారు. 2016 ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలో ట్రంప్  చాలా వరకు ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మరింత దారుణంగా పడిపోతున్న పరిస్థితి. మాజీ అధ్యక్షులు జో బైడెన్.. జిమ్మీ కార్టర్.. రోనాల్డ్ రీగన్ తదితరులతో పోలిస్తే ట్రంప్ రేటింగ్ అత్యంత కనిష్ఠానికి దిగజారినట్లుగా ఏఎఫ్ పోస్టు వెల్లడించింది. ఇదిలా ఉంటే మార్చి 26న ఫాక్స్ న్యూస్ నిర్వహించిన సర్వే ప్రకారం ట్రంప్ ప్రజామోద రేటు 41 శాతంగా నమోదైంది.

.సర్వేలో పాల్గొన్న వారిలో 59 శాతం మంది ఆయన పని తీరును వ్యతిరేకించారు. ఆయన రెండు పదవీ కాలాల్లో నమోదైన అత్యధిక వ్యతిరేక ఇదే కావటం గమనార్హం.
గత ఏడాది మార్చిలో ట్రంప్ నకు రిపబ్లికన్ల మద్దతు 92 శాతం ఉంటే.. ఇప్పుడు అది కాస్తా 84 శాతానికి పడిపోయింది.

డెమొక్రాట్లలో95 శాతం మంది ఆయన పని తీరుపై వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఇరాన్ తోయుద్ధాన్ని అమెరికాన్లు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. గత వీకెండ్ లో అమెరికాలో 50 రాష్ట్రాల్లోనూ ట్రంప్ నకు వ్యతిరేకంగా భారీఎత్తున నిరసనలు చోటు చేసుకోవటం తెలిసిందే. దాదాపు 80 లక్షల మంది అమెరికన్లు ట్రంప్ విధానాల్ని తప్పు పడుతూ రోడ్ల మీదకు వచ్చిన తన నిరసనను తెలియజేయటం తెలిసిందే.