ఈసీ లేఖపై బీజేపీ ముద్ర నిజమే కానీ…

కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన లేఖపై బీజేపీ ముద్ర కనిపించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అభ్యర్థుల నేర చరిత్ర వెల్లడింపు, ఎన్నికల ప్రచార నిబంధనలకు సంబంధించిన 2019 మార్గదర్శకాలపై ఈసీ ఇటీవల రాజకీయ పార్టీలకు లేఖ పంపింది.

అయితే ఆ లేఖపై బీజేపీ సీల్‌ ఉండటం వివాదానికి దారితీసింది. ఈ అంశాన్ని సీపీఎం సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేస్తూ, ఎన్నికల సంఘం తటస్థతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పటికే ఈసీ, బీజేపీ కుమ్మక్కైందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ఘటన మరిన్ని అనుమానాలకు తావిచ్చిందని విమర్శించింది. అధికారిక లేఖపై పార్టీ ముద్ర కనిపించడం సంస్థాగత నిష్పక్షపాత వైఖరిపై సందేహాలు కలిగిస్తోందని పేర్కొంది.

అయితే ఈ వివాదంపై కేరళ ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యు. కెల్కర్ స్పందిస్తూ, ఇది పూర్తిగా ‘క్లరికల్ పొరపాటు’ మాత్రమేనని స్పష్టం చేశారు. 2019 మార్గదర్శకాలపై వివరణ కోరుతూ బీజేపీ కేరళ యూనిట్ సమర్పించిన పత్రంపై పార్టీ ముద్ర ఉన్నదని, అదే పత్రాన్ని పరిశీలించే సమయంలో గుర్తించకపోవడంతో పొరపాటున ఇతర పార్టీలకు పంపిణీ చేసినట్లు వివరించారు.

ఈ లోపాన్ని గుర్తించిన వెంటనే మార్చి 21న ఆ లేఖను ఉపసంహరించుకుంటూ అధికారికంగా సవరణ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. సంబంధిత సమాచారం అన్ని రాజకీయ పార్టీలు, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు చేరవేసినట్లు పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని, ఇలాంటి కార్యాలయ స్థాయి పొరపాట్లను ఆధారంగా చేసుకుని తప్పుదారి పట్టించే ప్రచారం చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, కేరళలో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల రాజకీయ వేడి మరింత పెరిగింది.