ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా అవతరించాక నంది అవార్డులకు ప్రాధాన్యం తగ్గిపోవడం గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. తెలంగాణలో గద్దర్ అవార్డులను ప్రకటించి వరుసగా రెండేళ్లు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో ఏపీలోనూ నంది అవార్డులు ఇవ్వాలంటూ మెగాస్టార్ చిరంజీవి, ఆర్.నారాయణమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్లు గట్టిగా గళం వినిపించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించినట్లుగా ఈ ముగ్గురూ మాట్లాడడం మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఐతే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాత్రం.. సినీ ప్రముఖుల వ్యాఖ్యలను సానుకూలంగానే తీసుకున్నారు. నంది అవార్డుల మీద కసరత్తు జరుగుతోందని.. త్వరలోనే ఆ పురస్కారాలను అందజేస్తామని ఆయన ప్రకటించారు.
విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ‘‘నంది అవార్డుల విషయంలో మనకు ఏ రకమైన ఇబ్బందీ లేదు. ఆ అవార్డుల వేడుకను తప్పనిసరిగా నిర్వహిస్తాం. ఐతే గతంలో ఉన్నటువంటి పరిస్థితి.. మధ్యలో 2019-24 మధ్యలో ఉన్నటువంటి విధానం.. వీటన్నింటినీ సమీక్షించుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
పూర్వం నుంచి ఉన్న సినిమాలకు ఇవ్వాలా.. కొత్తగా ప్రారంభించాలా అనే విషయం మీద కసరత్తు జరుగుతోంది. సినిమా పురస్కారాలతో పాటు నంది నాటకోత్సవాలు కూడా కచ్చితంగా నిర్వహిస్తాం. 2019-24 మధ్య ఉన్న పరిస్థితికి, ఇప్పటికి చూస్తే.. కళాకారులు, రచయితలు, కవులు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్లకో గుర్తింపు ఉంది.
వాళ్లకు మనం ఇస్తున్న ఉగాది పురస్కారాలు, కళారత్న అవార్డులు, కందుకూరి పురస్కారాలు, గుర్రం జాషువా ఉత్సవాలు.. ఇలా లబ్ధప్రతిష్టులైన ప్రతి ఒక్కరి పేరు మీద రాష్ట్ర పండుగలు నిర్వహించడంతో పాటు కళాకారులు, జానపద కళారూపాలను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. సినిమా కోసం మరింత చేయాల్సి ఉంది. దాని మీద కసరత్తు జరుగుతోంది’’ అని కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates