ఇందుమూల‌ముగా.. బీజేపీ సుజ‌నా రూటే సెప‌రేట‌ట‌.. !

బిజెపి తరఫున తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి విజయం దక్కించుకున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రముఖ వ్యాపారవేత్త సుజనా చౌదరి తన రూటు సపరేటు అన్నట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న‌ చేస్తున్న వ్యాఖ్యలు కూటమిలో తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీని ఇరకాటంలో పెడుతున్నాయి. సహజంగా ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని కొన్ని పరిణామాలపై మూడు పార్టీలు ఉమ్మడిగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి.

సమస్య ఎవరిదైనా అందరూ కలిసి ఎదుర్కొనే లాగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర చీఫ్ పివిఎన్ మాధవ్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికిగాను సమన్వయం చేసేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. తిరుమల శ్రీవారి లడ్డు విషయం ప్రధానంగా చర్చకు వచ్చినప్పుడు అందరూ కలిసి సంయుక్తంగా దీనిని ఎదుర్కొనేందుకు, వైసిపి చేస్తున్న విమర్శలను గట్టిగా ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.

అయితే అనూహ్యంగా బిజెపిలోని ఒకరిద్దరు నాయకులు తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో ప్రభుత్వం పైనే ఎదురు దాడి చేస్తుండడంతో పాటు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను కూడా తప్పు పడుతుండడం ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంసంగా మారింది. దీనిపై నాయకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం ఉత్త‌రం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తిరుమల లడ్డు విషయంలో ప్రభుత్వం తొందరపడుతోందని చేసిన వ్యాఖ్యలు మంట‌లు రేపుతున్నాయి.

ఇక‌, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అసలు ఏ రిపోర్ట్ ఆధారంగా కల్తీ జరిగిందని చెబుతారంటూ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను బిజెపి నిశితంగా పరిశీలిస్తోంది. ఈ వ్యవహారంపై ఇటు పార్టీ పరంగా ఎలా ఉన్నప్పటికీ ప్రభుత్వపరంగా ఇద్దరు నాయకులు చంద్రబాబుకు అత్యంత విధేయులు. చంద్రబాబు అంటే అభిమానించే వారు కావడం తెలిసిందే. అయినప్పటికీ వారు చేస్తున్న వ్యాఖ్యలను చంద్రబాబు సీరియస్ గా తీసుకుంటున్నారు.

ఏదైనా సందేహం ఉంటే పార్టీ పరంగా అడిగి తెలుసుకోవచ్చని.. విషయం తెలియకపోతే సబ్జెక్టు నేర్చుకోవాలని ఆయన అంతర్గత సంభాషణలో బిజెపి నేతలకు సూచిస్తున్నారు. ఏదేమైనా కూటమి ఒకరకంగా ముందుకు సాగుతుంటే దీనికి ప్రత్యామ్నాయంగా తాము బలమైన వాయిస్ వినిపిస్తున్నామంటూ కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నది చంద్రబాబు పరోక్షంగా నాయకులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు. మరి వీరు మారతారా లేకపోతే ఇట్లాగే కొనసాగుతారా అనేది చూడాలి.