రాజా సింగ్ కు సీపీ వార్నింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు రాజాసింగ్. గోరక్షణ కోసం అవసరమైతే సొంతపార్టీపైనా పోరాటం చేస్తానంటూ రాజా సిింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, గోరక్షణ కోసం మరింత కఠిన చట్టాలు తేవాలని కోరుకునే రాజాసింగ్…అందుకోసం తన పదవినైనా త్యాగం చేస్తానంటూ గతంలో ప్రకటించారు. అయితే, బీజేపీ పెద్దలు తనను రాజీనామా చేయవద్దని వారించడంతో ఆ నిర్ణయం వాయిదా వేసుకున్నానని రాజాసింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆ వ్యాఖ్యల వేడి సద్దుమణగక ముందే సైబరాబాద్ పోలీసులపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాసులకు కక్కుర్తిపడి ఆవుల అక్రమ రవాణాకు తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారని రాజా సింగ్ షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణలోకి అక్రమంగా గోవుల రవాణా యథేచ్ఛగా జరుగుతోందని, దానిపై డీజీపీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పోలీసు ఉన్నతాధికారులు స్పందించకుంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఘాటుగా స్పందించారు.

పోలీసుల గురించి బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, రాజా సింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల మీద బీజేపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు ఎదుర్కోక తప్పదని సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల మీద, డీజీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని సజ్జనార్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

కాగా, మహారాష్ట్ర నుంచి హైదరాబాదుకు ఆవులను తరలిస్తున్న లారీని సోమవారం చౌటుప్పల్ చెక్ పోస్టు వద్ద రాజాసింగ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు డబ్బులు తీసుకొని ఈ లారీలను అనుమతిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ పై చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ వెల్లడించారు.