తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ తరఫున ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే ఎంపీగా ఉన్న జాతీయ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ.. మరోసారి నామినేషన్ వేశారు. ఇక, సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా.. నామినేషన్ వేశారు. అయితే.. మరెవరూ.. పోటీలో లేనందున.. ఇక, వీరి ఎన్నిక కూడా లాంఛనం కానుందని అధికారులు చెబుతున్నారు.
వాస్తవానికి.. రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ నుంచి పెద్ద ఎత్తున చర్చ తెరమీదికి వచ్చింది. మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతారని.. తద్వారా రేవంత్ రెడ్డికి.. మైనారిటీ అభ్యర్థిని బరిలో దింపక తప్పని పరిస్థితి కల్పిస్తారని కూడా కొందరు బీఆర్ ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మరో చర్చ కూడా తెరమీదికి వచ్చింది.
సింఘ్వీ ఎలానూ జాతీయ నాయకుడు కాబట్టి.. తెలంగాణ నుంచి బీసీకి అవకాశం ఇస్తారని కాంగ్రెస్‌లో చర్చ సాగింది. కానీ, రెడ్డి నాయకుడికి అవకాశం ఇచ్చారు. దీనికి ముందుగానే గుర్తించిన బీఆర్ఎస్ నాయకులు బీసీ నేతను కూడా బరిలో పెట్టనున్నారని.. తద్వారా రాష్ట్రంలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్న రేవంత్ రెడ్డిని.. ఇరకాటంలోకి నెట్టాలని భావించారని కూడా అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఈచర్చలు ఏ ఒక్కటీ నిలబడలేదు. చివరకు కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థులే మిగిలారు.
మరి బీఆర్ ఎస్ ఎందుకు వెనక్కి తగ్గింది? ఇదీ.. ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 1) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని.. ఇప్పుడు నేరుగా ఎన్నికలకు వెళ్తే.. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడే అవకాశం ఉంటుందని.. తద్వారా పార్టీ పరువు పోతుందన్న కారణంగా వెనక్కి తగ్గారని అంటున్నారు.
2) ఇప్పటికే జూబ్లీహిల్స్ సహా పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి పార్టీ నాయకులు కోలుకోలేదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎలానూ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి అనవసరంగా పోటీ చేసి పరాజయం పాలవడం వల్ల మరింతగా శ్రేణులు డీలా పడే అవకాశం ఉందని భావించి వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచినట్టేనని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates