బెజవాడ వైసీపీలో రోజుకో రగడ తెరమీదికి వస్తోంది. నాయకులు ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరులో తీరిక లేకుండా బిజీగా గడు పుతున్నారు. మంత్రిపై ఎమ్మెల్యే ఒకరు పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నం ఇప్పటికే.. వివాదం కాగా.. ఇప్పుడు మరో కొత్త రగడ తెరమీదికి వచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తూర్పు నియోజకవర్గంలో ఇద్దరు కమ్మ నేతలకు జగన్ అవకాశం ఇచ్చారు. వీరిలో ఒకరు తూర్పు నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ కాగా, మరొకరు గత ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొప్పన భవకుమార్. ఈయనకు విజయవాడ వైసీపీ వ్యవహారాల అధ్యక్ష పోస్టు ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఇక్కడ నుంచి పోటీ చేయాలనే విషయం ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా రగులుతూనే ఉంది.
తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఉన్నాను కనుక .. నేనే అన్నట్టుగా అవినాష్, కాదు.. గతంలో స్వల్ప తేడాతో(15 వేల ఓట్లు) ఓడాను కనుక నేనే మళ్లీ పోటీ చేస్తానని ఇద్దరూ.. తమ తమ అనుచరుల వద్ద ప్రకటించుకుంటూనే ఉన్నారు. ఇక, అవినాష్ దూకుడుగా ఉన్నారు. నియోజకవర్గం పరిధిలోని ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇక, బొప్పన కూడా తూర్పులో యాక్టివిటీ పెంచారు. ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్న ఇద్దరి మధ్య రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా దేవినేని వర్గం భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. విజయవాడ బస్టాండు, బెంజిసర్కిల్.. తూర్పు నియోజకవర్గంలో వీటిని భారీగా ఏర్పాటు చేశారు.
పార్టీలో ప్రోటోకాల్ ప్రకారం.. నగర అధ్యక్షుడిగా ఉన్న బొప్పన భవ కుమార్ ఫొటోను కూడా ఫ్లెక్సీపై ముద్రించాలి. కానీ.. దేవినేని అవినాష్ వర్గం మాత్రం సీఎం జగన్, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఫొటోలతోపాటు అవినాష్ చిత్రాన్ని భారీగా ముద్రించి.. బొప్పన భవకుమార్ ఫొటోను ఎలిమినేట్ చేసింది. దీంతో భవకుమార్ వర్గం అగ్గిమీద గుగ్గిలమైంది. పోటీగా.. భవకుమార్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఇది చిలికి చిలికి గాలివానగామారి ఇరు పక్షాల మధ్య తీవ్ర వివాదం అయ్యే పరిస్థితి ఏర్పడింది.
అంతేకాదు.. ఒక నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు ఎవరికి అనుకూలంగా వ్యవహరించాలో తెలియక తల పట్టుకుంటోంది. టికెట్ విషయం రేగిన వివాదం… ఎన్నికలకు మూడేళ్ల ముందే ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉంటుందోనని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వివాదం ఎలా సమసి పోతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates