వచ్చే ఎన్నికలకు సంబంధించి రెండు జిల్లాలకు సీఎం చంద్రబాబు బిగ్ టార్గెట్ విధించారు. వచ్చే 2029 ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో కూటమి అభ్యర్థులు వంద శాతం స్ట్రయిక్ రేట్ సాధించాలని నిర్దేశించారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త జిల్లా.. మార్కాపురం ఏర్పాటు చేశామని చెప్పిన చంద్రబాబు.. ఆ మేరకు కూటమి అభ్యర్థులను ఇక్కడి వారు గెలిపించి ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
ప్రాజెక్టు కట్టకుండానే..
గత వైసీపీ పాలనలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే.. పూర్తయినట్టుగా రిబ్బన్ కట్ చేసి.. ప్రారంభించారని, తద్వారా ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. బుధవారం సాయంత్రం ఆయన మార్కాపురంలో పర్యటించారు. వెలిగొండ ప్రాజెక్టులో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం.. నిర్వహించిన ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు. ప్రకాశం జిల్లా ప్రజలు ఎన్నోఏళ్లుగా కోరుకుంటున్న మార్కాపురం ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేసి.. వారిలో ఆనందం నింపామని తెలిపారు.
అందుకే కలిశాం..
ఈ సందర్భంగా కూటమి పార్టీల ఐక్యతపై చంద్రబాబు స్పందిస్తూ.. రాష్ట్రానికి మేలు చేసేందుకే.. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. గత పాలకులు రాష్ట్రాన్ని లూటీ చేశారన్న ఆయన.. వారి నుంచి ప్రజలను కాపాడేందుకు, రాష్ట్ర వనరులను రక్షించేందుకు.. కలిశామని అన్నారు. వచ్చే 15 సంవత్సరాలు కూడా.. కూటమి కలిసే ఉంటుందన్నారు. అరకు నుంచి ప్రకాశం జిల్లా వరకు కూటమి పార్టీలకే ప్రజలు మద్దతు పలుకుతున్నారని చెప్పారు.
రెండు దశల్లో పూర్తి..
వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తే.. ఉమ్మడి ప్రకాశం సహా నెల్లూరు ప్రజలకు కూడా తాగు, సాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని సీఎం చంద్రబాబు చెప్పారు. 2014-19 మధ్య ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించామన్న ఆయన.. మిగిలిన పనులను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించిందని.. పైగా పనులు పూర్తి చేయకుండానే.. రిబ్బన్ కటింగ్ చేసి..ఇక్కడి వారిని అప్పటి సర్కారు మోసగించిందని దుయ్యబట్టారు. ఈ ప్రాజెక్టును తాము రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్టు చంద్రబాబు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates