ఎన్నికలు దగ్గర పడేకొద్దీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. రెండు రోజుల్లో ముగ్గురు ఎంఎల్ఏలు రాజీనామాలు చేశారు. బారక్ పూర్ ఎంఎల్ఏ శీలభద్ర దత్తా రాజీనామా చేశారు. అంతకు ముందు జితేంద్ర తివారి, సువేందు అధికారి రాజీనామాతో తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎంఎల్ఏల సంఖ్య మూడుకు చేరింది. వీరందరు పార్టీకి రాజీనామా చేశారే గానీ ఎంఎల్ఏ పదవులకు కాదు. రాజీనామాలు చేసిన ముగ్గురిలో మమతకు అత్యంత సన్నిహితుడు, పార్టీలో కీలక నేత సువేందు అధికారి రాజీనామా చేయటమే సంచలనంగా మారింది.
రాజీనామా చేసిన నేతలు ప్రస్తుతానికి ఏ పార్టీలోను చేరకపోయినా తొందరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మమతను ఓడించటమే టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ముఖ్యమంత్రిని అన్నీ విధాలుగా అస్తిరపరిచేందుకు పెద్ద ప్లాన్ తోనే వెళుతోంది కమలంపార్టీ.
ఒకవైపు గవర్నర్ మమతప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో అఖిల భారత అధికారులను కేంద్రప్రభుత్వం కేంద్ర సర్వీసుల్లోకి పిలిపించుకుంటోంది. అయితే దీనికి మమతాబెనర్జీ అడ్డుపడుతుండటంతో మమత-కేంద్రప్రభుత్వం మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కమలంపార్టీ నేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించటం ద్వారా ముఖ్యమంత్రిని అభద్రతకు గురిచేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఇదంతా ఓవైపు చేస్తునే పార్టీలోని ఎంఎల్ఏలను, కీలక నేతలకు వల విసురుతోంది. మరి కమలంపార్టీ విసిరిన గాలానికి తగులుకున్నారో లేకపోతే పార్టీలో, వ్యక్తిగత సమస్యల వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నారో తెలీదుకానీ ఇప్పటికి ముగ్గురు రాజీనామాలు చేశారు. మరి భవిష్యత్తులో ఇంకెంతమంది రాజీనామాలు చేస్తారో తెలీకుండా ఉంది. ఇటువంటి చర్యలు వల్ల తృణమూల్ కాంగ్రెస్ లో ఓ విధమైన అయోమయం పెరిగిపోతోందన్నది వాస్తవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates