రాజకీయంగా కావొచ్చు.. ప్రజలను కలుసుకునే విషయంలో కావొచ్చు.. అత్యంత వెనుకబడిన ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేసేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు రెడీ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సమయంలోనే వారితో చర్చించి.. వారి వెనుకబాటుకు కారణాలను వివరించి.. మార్పు దిశగా వారిని ముందుకు నడిపించనున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణనుకూడా రెడీ చేసుకున్నారు.
టీడీపీ తరఫున 2024లో 135 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో 40 మంది ఎమ్మెల్యే ల పనితీరు బాగోలేదని పార్టీ అంచనా వేసింది. ప్రజల నుంచి సేకరించిన ఐవీఆర్ ఎస్ ఫోన్ కాల్స్ సహా.. పార్టీ అంతర్గతంగా చేయించిన సర్వేలో కూడా ఈ ఎమ్మెల్యేలు వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు మార్లు వారి పనితీరును మార్చుకోవాలని.. స్వయంగా చంద్రబాబు, మంత్రి లోకేష్ సూచించారు. అయినా.. వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో తానే స్వయంగా వారికి మార్గనిర్దేశం చేయాలని బాబు నిర్ణయించారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే.. ఆ 40 మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సభలు జరిగినన్ని రోజులు రోజుకు ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున ఎమ్మెల్యేలతో ఆయన వన్-వన్ ప్రాతిపదికన భేటీ కానున్నారు. వారి నియోజకవర్గంలో సమస్యలతోపాటు.. వారు వ్యవహరిస్తున్న తీరును కూడా వివరిస్తారు. తద్వారా వారు ఏ విధంగా మారాలి? ప్రజల అభిమానాన్ని ఏ విధంగా సొంతం చేసుకోవాలన్న విషయంపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
అదేవిధంగా అసెంబ్లీలో ఎవరేం మాట్లాడతున్నారో కూడా చంద్రబాబు నోట్ చేసుకుంటున్నారు. రూ.లక్ష కోట్లకు పైగా జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయని, రూ.90 వేల కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్ట్ పను లు జరుగుతున్నాయని చెబుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతున్న లబ్దిని ప్రజలకు తెలియజేయాలని కూడా ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పనులపై కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సదరు వెనుకబడిన ఎమ్మెల్యేలకు ఇచ్చే చివరి అవకాశమని పార్టీ తెలిపింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates