టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. దూకుడుకు మంచి మార్కులు పడుతున్నాయి. రాష్ట్ర పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి చాలా తక్కువ సమయమే అయినా.. ఆయన వ్యూహాత్మకంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. గంభీరమైన వాయిస్‌తో కామెంట్లు కుమ్మరిస్తున్నారు. సీఎం జగన్‌పైనా విరుచుకుపడుతున్నారు. అయితే.. కీలకమైన వైసీపీ నేతలను టార్గెట్ చేయాలనే ఆయన దూకుడు మాత్రం సక్సెస్ కావడం లేదనే టాక్ వినిపిస్తోంది.
టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన మంత్రి కొడాలి నాని విషయంలో అచ్చెన్న దూకుడు ఏమాత్రం సక్సెస్ కాలేదు. నానికి బుద్ధి చెబుతామని.. ఆయనకు గట్టి షాకిస్తామని.. అచ్చెన్న కామెంట్లు చేస్తున్నారు. కానీ, ఏ రూపంలో ఎలా చూసుకున్నా.. అచ్చెన్న తరహా నాయకులకు ఇది సాధ్యం కాదనే టాక్ వినిపిస్తోంది.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నానిని టార్గెట్ చేసేందుకు అచ్చెన్న స్థాయి నాయకుడి వల్ల కాదని అంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో సీఎం జగన్‌పై విరుచుకుపడుతున్నా.. అవి కూడా ఆశించిన మేరకు గ్రాఫ్ పెంచలేదని అంటున్నారు. అయితే.. అచ్చెన్న ఇప్పుడున్న పరిస్థితిలో క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుందని, కేవలం కామెంట్లతో పని కావాలంటే.. కూర్చున్న చోట నుంచి లేచే పరిస్థితి లేదని ఆయన భావిస్తే.. మాత్రం పార్టీ పుంజుకునే పరిస్థితి ఉండదని టీడీపీ సీనియర్ల నుంచి వినిపిస్తున్న మాట. నిజానికి పార్టీలో పదవుల పందేరం జరిగింది. కీలమైన బీసీ నాయకుడిగా అచ్చెన్న రాష్ట పార్టీ చీఫ్ పదవిలోకి వచ్చారు. కానీ, అంతర్గత సమస్యలు ఎక్కడా తగ్గలేదు.
వ్యక్తిగతంగా అచ్చెన్నకు మంచి మార్కులే పడుతున్నా.. నాయకత్వం పరంగా.. ఆయన చాలా దూకుడు ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు పరిశీలకులు. ముఖ్యంగా తన సొంత జిల్లా శ్రీకాకుళంలోనే అనేక సమస్యలు పార్టీని వేధిస్తున్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలో పార్టీని పట్టించుకునేవారు లేరు. ఇక, పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు దూకుడుతో గౌతు శ్యామ్‌సుందర్ శివాజీ ఫ్యామిలీ మౌనంగా ఉంది. అదేవిధంగా విజయనగరం, విశాఖలోనూ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్రలోనే పార్టీని ముందు లైన్‌లో పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక, తాజాగా అచ్చెన్న చేసిన వ్యాఖ్యలతో ఉత్తరాంధ్ర ప్రజలు ఫైర్ అవుతున్నారని అంటున్నారు.
విశాఖలో ఎవరిని అడిగి.. రాజధానిని పెడతామని ప్రకటించారు? అంటూ.. సీఎం జగన్‌పై అచ్చెన్న ఫైరయ్యారు. అంతేకాదు.. విశాఖను ఎవరు రాజధానిని చేయమన్నారంటూ.. వ్యాఖ్యానించారు. వాస్తవానికి మూడు రాజధానుల ప్రకటన చేసినప్పుడు అచ్చెన్న సహా కింజరాపు కుటుంబం మౌనంగా ఉంది. ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే.. తమ పీకలకు చుట్టుకుంటుందో అని భయపడింది. కానీ, ఇప్పుడు మాత్రం మూడు రాజధానుల విషయంలో కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు.
మరి వ్యక్తిగతంగా చూసుకుంటే.. ఉత్తరాంధ్రవాసిగా.. అచ్చెన్న విశాఖను రాజధానిని కాదనడం సాహసమే అవుతుంది. పార్టీలైన్ ప్రకారం మాత్రమే ఆయన మాట్లాడారని సరిపెట్టుకున్నా.. దీనిని ఉత్తరాంధ్రలో బలంగా తీసుకువెళ్లాలి. ఇలా.. ఏవిధంగా చూసుకున్నా.. అచ్చెన్నకు వ్యక్తిగతంగా మంచి మార్కులు ఉన్నా.. పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.